చైనా చేతుల్లో ఫార్మా!
యావత్ ప్రపంచానికి ఫార్మసీగా భారతదేశానికి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలను అందించే దేశంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచ ఫార్మా ఎగుమతుల్లో సింహభాగం వాటా మన దేశానిదే కావడం విశేషం. ఆఫ్రికా దిగుమ తుల్లో 50%, అమెరికాలో 40%, బ్రిటన్‌లో 25% వాటా కలిగి ఉండటమే అందుకు నిదర్శనం. అయితే, ప్రపంచ ఫార్మారంగాన్ని శాసిస్తున్న భారత్ ముడిసరుకుల కోసం చైనాపై అతిగా ఆధారపడుతుండటం శోచనీయం.
ముఖ్యంగా ప్రాథమిక ముడిపదార్థాలతోపాటు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్లు 65 శాతం వరకు చైనా నుంచే దిగుమతి అవుతున్నట్టు నీతిఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించడం ఆందోళన కలిగిస్తున్నది. వ్యాధులను తగ్గించడానికి ఔషధాల్లో వాడే క్రియాశీల రసాయన పదార్థాలైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్ల కోసం ఇతర దేశాలపై, అదీ చైనాపై ఆధారపడటం ఏమాత్రం మంచిది కాదనే చెప్పాలి.
ముడిపదార్థాల సరఫరాలో ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించేసిన చైనా ఫార్మారంగాన్ని కూడా శాసిస్తుండటం భారత్‌కు ఆర్థికపరంగా, వ్యూహాత్మకంగా నష్టం కలిగించే అంశమే. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినా, వాణిజ్య ఆంక్షలు విధించినా లేదా సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడినా భారత ఔషధ పరిశ్రమపై తక్షణ ప్రభావం పడుతుంది. ఒకవేళ చైనా నుంచి సరఫరా నిలిచిపోతే ఔషధాల తయారీ నిలిచిపోవడం, ఉత్పత్తి వ్యయం పెరగడం, తత్ఫలితంగా దేశీయంగా ధరలు ఎగబాకడం లాంటి దుష్పరిణామాలు తలెత్తవచ్చు. ముడిసరుకు కొరత ఏర్పడితే ఎంతటి తయారీ సామర్థ్యం ఉన్న దేశమైనా ఉత్పత్తిని కొనసాగించడం కష్టమవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రపంచ రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో దేశాలు తమ వ్యూహాత్మక రంగాలపై ఆంక్షలు విధిస్తూ ప్రపంచ వాణిజ్యాన్ని నియంత్రిస్తుండటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి తరుణంలో ఒకే దేశంపై అతిగా ఆధారపడటం సరఫరా భద్రతకు ముప్పుగా మారవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే దేశీయంగా ముడిపదార్థాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులు పెంచడంతో పాటు చిన్న, మధ్యతరహా తయారీ సంస్థలకు ఆర్థిక సహాయం అందించాలి. అలాగే ముడిప దార్థాల దిగుమతులను ఇతర దేశాలకు విస్తరించాలి. ప్రపంచ ఔషధ రంగం పై భారత పట్టును నిలబెట్టుకోవాలంటే ముడిపదార్థాల విషయంలో స్వావలంబన సాధించడం అత్యవసరమని చెప్పక తప్పదు.






