11-12-2025 01:09:08 PM
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల(Telangana Gram Panchayat Elections) తొలి విడత పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. తొలి దశలో 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
తెల్లవారుజామునుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరడంతో అనేక గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు పట్టణాలు, నగరాల్లో పనిచేస్తున్న చాలా మంది ఓటర్లు తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. తొలి విడుత ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను నిశితంగా పర్యవేక్షించారు. చలిని సైతం లెక్క చేయకుండా దివ్యాంగులు, వృద్దులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.