1 July, 2026 | 11:54 AM

రికార్డుల ర్యాలీకి బ్రేక్

25-05-2024 01:30 AM

న్యూఢిల్లీ, మే 24:  రిజర్వ్‌బ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి భారీస్థాయిలో రూ.2.11 లక్షల డివిడెండు చెల్లించాలని నిర్ణయించడంతో మార్కెట్ గురువారం జరిపిన రికార్డు ర్యాలీకి శుక్రవారం బ్రేక్ పడింది.  గరిష్ఠ ధరల్లో ఉన్న షేర్ల నుంచి వారాంతంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరపడంతో స్టాక్ సూచీలు స్వల్ప తగ్గుదలతో ముగిసాయి. గురువారం రాత్రి అమెరికా మార్కెట్లు భారీగా తగ్గడం, శుక్రవారం ఆసియా, యూరప్ సూచీలు బలహీనంగా ట్రేడ్‌కావడం కూడా లాభాల స్వీకరణకు పురికొల్పినట్టు ట్రేడర్లు చెప్పారు. పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన  బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 218 పాయింట్లు పెరిగి 75,636 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు 7.65 పాయింట్ల నష్టంతో 75,410 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  ఇంట్రాడేలో తొలిసారిగా 23,000 పాయింట్ల స్థాయిని అధిగమించి 23,026 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు 10.55 పాయింట్ల నష్టంతో 22,957 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,404 పాయింట్లు (1.89 శాతం), నిఫ్టీ 455 పాయింట్లు (2 శాతం) చొప్పున పెరిగాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలు నష్టాలతో ముగిసాయి. యూరప్ సూచీలు సైతం ఇదేబాటను అనుసరించాయి. గురువారం రాత్రి అమెరికా డో జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ రికార్డుస్థాయి నుంచి 600 పాయింట్లకుపైగా పతనమయ్యింది.