calender_icon.png 9 May, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేబరాఫీసులో లంచావతారాలు

08-05-2025 01:14:57 AM

-ముందుకు కదలని ఫైళ్లు.. చేతికందని లబ్ధి 

- విసిగి వేసారిపోతున్న అర్జీదారులు

హుజురాబాద్, మే 7 (విజయక్రాంతి) : భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం లేబర్ కార్డును ప్రవేశపెట్టి ఎన్నో విధాల లబ్ధిని అందజేస్తుంది. అయితే వీటిలో ఎక్కువగా ఆడపిల్లల పెళ్లి, రెండు కాన్పులకు అందించే లబ్దికే ఎక్కువ దరఖాస్తులు అందుతున్నాయి.

హుజురాబాద్ డివిజన్ పరిధిలోని గ్రామాల లేబర్ కార్డు లబ్ధిదారులు సహాయ కార్మిక అధికారి కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా ప్రదక్షిణలు చేసినా, ముడుపులు ముట్టజెప్పనిదే దరఖాస్తులు ఫైల్ కావడం లేదని, అవి ముందుకు కదలడం లేదని ఆర్జీదారులు ఆరోపిస్తున్నారు.

కార్యాలయంలో ముడుపులు ముట్టజెప్పిన పైరవీ కారుల ఫైలులే ముందుగా కదులుతున్నాయని, గ్రామాలలోని ప్రజలు స్వయంగా ఆర్జీ పెట్టుకొని దరఖాస్తులు అప్పగించడానికి వచ్చిన వారి పనులు కావడంలేదని, ఆఫీసు కార్యనిర్వాహణాధికారి ఎప్పుడూ అందుబాటులో ఉండరని, లంచాల్లో చురుగ్గా... విధుల్లో బెరుకు గా నిర్లక్ష్య వ్యవహారంతో ఫైళ్లు ముందుకు కదలక, లబ్ధి చేతికందక విసిగి వేసారి పోతున్నామని ఆర్జీదారుల ఆరోపణలు. కార్యాలయానికి వచ్చే సందర్శకుల సమస్యలు ఒక్కొక్కటి కొన్ని నెలల తరబడినవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హుజురాబాద్ లోని కార్యాలయం వ్యవహారం లేబర్ కార్డు ప్రయోజనాలకి అర్థమే లేకుండా పోతుందని, కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో కార్యాలయ అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని  కార్యాలయం ఆవరణలో వివిధ మండలాల గ్రామాల నుండి వచ్చిన ఆర్జీదారులు  వాపోయారు.

రూ.2,500 ఇచ్చాను.. అయినా ఫైల్ ముందుకు వెళ్లలేదు

శంకరపట్నం మండలం, చింతగట్టు గ్రామానికి చెందిన కనకం పోచవ్వ  ఏడాది క్రితం తన చిన్న కూతురికి పెళ్లి చేసి. వివాహ లబ్ధి కోసం  ఆర్జీ పెట్టుకుని.హుజురాబాద్ లోని  సహాయ కార్మిక అధికారి కార్యాలయానికి వెళ్ళింది.అక్కడ ఫైల్ అప్పగించే సమయంలో సహాయ కార్మిక అధికారిణి కొంత సొమ్ము కోరడంతో కార్యాలయం వెలుపల రూ. 2500లు అప్పగించాను అని తెలిపింది. 

తనకు ఇంకా లబ్ధి అందలేదని, చెప్పులరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే ఒకసారి ఫైల్ పోయిందని, మళ్లీ తిరిగి ఫైల్ చేయించుకు రమ్మని వెనక్కి పంపారు. మా గ్రామంలో నాకన్నా వెనుక  పెళ్లి చేసినవారికి లబ్ధి చేకూరింది కానీ, కూలీ నాలి చేస్తే బ్రతకడం తప్ప కార్యాలయం చుట్టూ తిరగలేక అధికారి కోరిన డబ్బు  ఇచ్చి పది నెలలైనా నాకు లబ్ధి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

 కనకం పోచవ్వ, చింతగుట్ట గ్రామస్తురాలు

నాకన్నా రెండు నెలల కిందటి ఫైలు ముందుకు వెళ్ళింది

సైదాపూర్ మండలం, లింగాల దుద్దెనపల్లి గ్రామానికి చెందిన సోమారపు రాజయ్య కాన్పు లబ్ధి కోసం ఆర్జి పెట్టి ఆరు నెలలు కావచ్చిన, నమోదైన ఫైలు కనిపించడం లేదంటున్నారు. తనకన్నా రెండు నెలల కిందటి ఫైలు ముందుకు వెళ్లిందే తప్ప తన ఫైలు ముందడుగు వేయలేదని, అర్జంట్, అర్జంట్‌గా వెళుతు న్న ఫైళ్ళ వెనుక మతలబేమిటో చెప్పకనే చెప్పవచ్చు.

కార్యాలయంలో ముడుపుల మీద శ్రద్ధ విధుల మీద లేదంటూ ఆరోపించారు. టౌన్‌కి వెలుపల ఉన్న ఈ కా ర్యాలయంతో ఆర్జీదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, కార్యాలయ అధికారి అందుబాటులో ఉండరని, సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, కార్యాలయాన్ని  స్థానిక తహసిల్దార్ కార్యాలయం సమీపంలోకి మార్చాలని, ఉన్నతాధికారులు కార్యాలయాన్ని పర్యవేక్షించాలని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

మూ సోమారపు రాజయ్య, లింగాల దుద్దెనపల్లి గ్రామస్తుడు