10-12-2025 07:54:03 AM
గ్రామంలో ఉద్రిక్త వాతావరణం.. భారీగా మోహరించిన పోలీసులు
నూతనకల్,(విజయక్రాంతి): మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో(Lingampalli Village) గ్రామ పంచాయతీ ఎన్నికల(Gram Panchayat election) ప్రచారం రణరంగాన్ని తలపించింది.రాజకీయ వర్గాల ఘర్షణలో ఒక నిండు ప్రాణం బలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి గ్రామంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తుండగా ఇరువర్గాలు ఎదురుపడ్డాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది.
క్షణికావేశంలో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు.ఈ దాడిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త ఉప్పుల మల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు.గమనించిన స్థానికులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మల్లయ్య మృతి చెందారు.ఎన్నికల వేళ జరిగిన ఈ హత్యతో లింగంపల్లి గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.