10-12-2025 02:28:53 AM
తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
సమగ్ర ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకే డాక్యుమెంట్
నెహ్రూ చూపిన మార్గం చిరస్మరణీయం
జాతి వివక్షను ప్రోత్సహించేలా విద్యావిధానం ఉండొద్దు
గ్లోబల్ సమ్మిట్ ముగింపులో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : సామాజిక న్యాయం సాధించ డమే విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకం గా నిర్వహిస్తోన్న గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను మంగళవారం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. తెలంగాణ నేల చాలా చైతన్యవంతమైన నేల అని, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ ప్రాంతంలో ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు.
‘చివరకు స్వరాష్ర్టం సాధించుకున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగలేదన్నారు. అందుకే ఒక సమగ్ర ప్రణా ళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక విజన్‌తో డాక్యుమెంట్‌ను రూపకల్పన చేశాం. తెలంగాణను మూడు జోన్లుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకు న్నాం. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం సాధించేలా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాం’ అని ముఖ్య మంత్రి చెప్పారు.
30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మో దీ ముందుకు సాగుతున్నారని, దాంతో పాటే తాము కూడా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకనామీగా ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. అన్ని వర్గాలను వారిని సంప్రదించి విజన్ డాక్యుమెంట్ రూ పొందించామని, పేదలు, రైతులు, వ్యాపారులు, యువతకు అభివృద్ధి ఫలాలు దక్కే లా డాక్యుమెంట్ రూపకల్పన చేశామని చెప్పారు.
ఇరిగేషన్, ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమని తొలి ప్రధాని నెహ్రూ భావించేవారని, అందుకే ఆయన యూనివర్సిటీలు, ప్రాజెక్టులు ఎక్కువగా నిర్మించారని గుర్తుచేశారు. నెహ్రూ చూపిన మార్గం చిరకాలం అనుసరణీయమని చెప్పారు. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పేదలకు సంక్షేమ ఫలా లు అందించాలన్నదే తమ ఆకాంక్ష అని, కొందరికి పేదరికం ఎక్స్కర్షన్ లాంటిదని, కానీ తనకు పేదరికం ఏంటో తెలుసు అన్నా రు.
తాను ఒక మారుమూల గ్రామంలోని రైతు కుటుంబం నుంచి వచ్చానని, పేదలు, రైతుల సమస్యలు బాగా తెలుసు అన్నారు. తనకు పేదలు, దళితులు, ఆదివాసీలతో మంచి అనుబంధం ఉందని, పేదల కష్టాలు తెలిసినవాడిగా ప్రతీ పేదవాడికి సంక్షేమం అందించాలన్నదే తన తపన వెల్లడించారు. తన ఆలోచనలు, డాక్యుమెంట్ కూడా పేద లు, రైతుల చుట్టే తిరుగుతుందన్నారు. కు లం, మతం ఆధారంగా విద్యాసంస్థలు ఉం డటం సరికాదని, అన్ని కులాలు, అన్ని మతాలు ఒకేచోట చదవాలనేదే తన ఆశయమని స్పష్టం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో జాతి వివక్షను ప్రొత్సహించేలా విద్యా విధానం ఉండొద్దని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. విద్యార్థి దశలోనే కులవివక్షను నిర్మూలించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీలకు ఒకే చోట విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని, అట్టడుగువర్గాల, పేదల అభివృద్ధి కోసమే ఈ తెలంగాణ రైజింగ్-2047 విజ న్ డాక్యుమెంట్ అని ప్రకటించారు. రైజింగ్ విజన్‌డాక్యుమెంట్‌ను 83 పేజీలతో రూపకల్పన చేశారు.
డాక్యుమెంట్‌లో యువత, మహిళలు, రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. 10 కీలక వ్యూహాలతో మూడు భాషల్లో రూ పొందించారు. సమతుల్య అభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్‌విధానం తీసుకొచ్చారు. పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత విధానపరమైన నిర్ణయాలను ప్రోత్స హించాలని నిర్ణయించారు. గేమ్‌ఛేంజర్ ప్రా జెక్ట్‌లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాల రూపకల్పన చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
ఇది సినీ ఇండస్ట్రీకి దక్కిన గౌరవం: ప్రముఖ నటుడు చిరంజీవి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పాల్గొనడం కేవలం చిరంజీవికి వచ్చిన ఆహ్వానం మాత్రమే కాదని, మొత్తం సినీ ఇండస్ట్రీకి దక్కిన గౌరవం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ఫిల్మ్ హబ్‌గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఎంతో తాపత్రయ పడుతున్నారని, ఇతర భాషల వాళ్లు కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్‌లు చేసుకునేలా సౌకర్యవంతమైన వాతా వరణం క్రియేట్ చేశారని కొనియాడారు.
ప్రభుత్వం తరపున ఇండస్ట్రీకి పూర్తి మద్దతు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారని స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో చిరంజీవి పాల్గొని మాట్లాడారు. ఇంత గొప్ప సభ లో పాల్గొనే అవకాశం కల్పించిన రాష్ర్ట ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. విభిన్న రంగాలకు చెందిన నిష్ణాతులు ఇక్కడ ఉన్నారు. వారితో కలిసి వేదిక పంచుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. త్వరలోనే సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తాం.
రేవంత్ రెడ్డి కలలుగన్నట్లుగా హైదరాబాద్‌ను ప్రపంచానికి సినీ హబ్‌గా మార్చే ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతాం. యువత చెడు వ్యస నాల వైపు మళ్లకుండా చిత్ర పరిశ్రమ చేయగలదు. ఇదే ఆలోచనతో కొరియా ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రొత్సహించిందని చిరంజీవి గుర్తుచేశారు. సిల్క్ డెవల ప్‌మెంట్ చేస్తే చాలు.. అనుకున్నది సాధించగలం అన్నారు. అత్యాధునిక స్టూడియోలు పెట్టేందుకు ఇప్పటికే ఎంతోమంది ఇక్కడికి వచ్చారని, చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందితే జీడీపీకి కూడా ఎంతో ఉపయోగమని అభిప్రాయపడ్డారు.
చిత్ర పరిశ్రమకు అవసరమైన స్కిల్స్ నేర్పే అకాడమీ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి చిరంజీవి ఎలాగైనా రావాలని, రేవంత్ రెడ్డి నా దగ్గరికి మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబును పంపించారు. ఆ సమయానికి నేను అన్నపూర్ణ స్టూడియోలో అమ్మాయితో డాన్స్ వేస్తున్నాను అని చెబుతూ చిరంజీవి నవ్వు లు పూయించారు.
డాక్యుమెంట్‌లో దార్శనికత: ఆనంద్ మహీంద్రా
తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌లో యువ త, మహిళలు, అభివృద్ధి అన్ని సమ్మిళితంగా ఉన్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీ్ంర దా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్--2047 చూస్తే నిపుణులు, తెలంగాణ ప్రజలు కలిసి రూపొందించిన పత్రంలా అనిపించిందని అన్నారు. మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా మాట్లాడిన మహీంద్రా..
తెలంగాణ రైజింగ్ విజన్ బ్లూప్రింట్ చూశానని, స్పూర్తిదాయక విజన్ డాక్యుమెంట్ రూపొందించినందుకు, ఆ దార్శనికతకు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో డాక్యుమెంట్ రూపొందించారని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఉండాలని మొదట సీఎం నన్ను అడిగారని, కానీ ఇప్పటికే టెక్ మహీంద్ర యునివర్సిటీకీ చైర్మన్‌గా ఉన్నందున వద్దని చెప్పానని గుర్తు చేశారు.
కానీ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యాలు విజన్ విన్నాక తిరస్కరించలేకపోయానన్నా రు. నాలుగు దశాబ్దాల వ్యాపారవేత్తగా ఉన్న నాకు రేవంత్ ఓ సమఉజ్జీలా కనిపించారన్నారు. ఎంత డిజిటల్ అయినా, ఎంత ఏఐ వచ్చినా.. హ్యమన్ టచ్ కు ఉన్న ప్రాధాన్యత వేరు అని ఆ స్కిల్ ను భర్తీ చేయడం ఎవరి తరం కాదన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మహిళలు నడుపుతున్న బ్యాటరీ పరిశ్రమ తమకు గర్వకారణం అని చెప్పారు.
తెలంగాణ రైజింగ్ అన్‌బీటబుల్ : ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి
తెలంగాణ గొప్ప అభివృద్ధి సాధిస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. దేశంలోనే వృద్ధిరేటు ఎక్కువగా ఉన్న రాష్ర్టంగా నిలిచిందన్నారు. ‘హైదరాబాద్ ఐకానిక్ నగరంగా నిలిచింది. ప్రపంచస్థాయి కంపెనీలకు ఇప్పుడు గమ్యస్థానంగా ఉంది. నీతి ఆయోగ్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఉంది. దేశంలోనే వృద్ధిరేటు ఎక్కువ గా ఉన్న రాష్ర్టంగా తెలంగాణ నిలిచింది. ఏటా 8-9 శాతం వృద్ధి సాధిస్తే తెలంగాణ తన లక్ష్యాలను అందుకోగలదు ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీకి హబ్ హైదరాబాద్ నిలిచింది. భౌతిక మౌలిక వసతులతోపాటు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి’ అని సుబ్బారావు పేర్కొన్నారు.