calender_icon.png 10 December, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడు

10-12-2025 03:04:31 AM

  1. అప్పుడే 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధ్యం 
  2. వ్యవసాయ రంగంలో ఏఐ, డీప్ టెక్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడాలి 
  3. 2047 విజన్ డాక్యుమెంట్ భవిష్యత్తుకు ప్రతిజ్ఞ
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యసాధన సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన క్యాపిటల్ అండ్ ప్రోడక్టివిటీ ఫర్ 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చర్చా గోష్టిలో    భట్టి ప్రసంగించారు. రాబోయే 22 ఏళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం లెక్కిస్తే 16 రెట్లు ఆర్థిక వృద్ధిని సాధించాల్సి ఉందని తెలిపారు. తాము ‘తెలంగాణ రైజింగ్ 2047’ను ఆవిష్కరించామని, ఇది కేవలం ఒక పత్రం కాదు.

ఇది మన భవిష్యత్తుకి ఇచ్చిన ప్రతిజ్ఞ అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపడం అనే మహత్తర లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఉత్పాదకతే తెలంగాణ సాధారణ పౌరుడి వేతనాలు, గౌరవాన్ని శాశ్వతంగా పెంచే ఏకైక మార్గం అని వివరించారు. 

డీప్‌టెక్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ యుగంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనేది కేవలం కనీస అర్హత, అది ఒక బేస్‌లైన్ మాత్రమే అని అన్నారు. ఆసియాలో ఇన్నోవేషన్ క్యాపిటల్ కావాలంటే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుండి ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు సాగాలి. ఫైళ్లు క్లియర్ చేయడమే కాదు, ఎకోసిస్టమ్‌లను క్రియేట్ చేసే ప్రభుత్వం కావాలి అని తెలిపారు. 

క్యూర్, ప్యూర్, రేర్ జోన్‌లకు పీపీపీ ఇంధనం

3 డాలర్ ఎకానమీ సాధనకు ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్ షిప్పులు అనివార్యం అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికలో నిర్వహించిన ఇన్నోవేటివ్ పీపీపీఎస్ చర్చా గోష్టిలో ఆయన ప్రసంగించారు. మన యూఎస్డీ 200 బిలియన్ జీఎస్‌డీపీ, 37 శాతం ఇన్వెస్ట్‌మెంట్ రేటుతో సంవత్సరానికి యూఎస్‌డీ 70 బిలియన్ తెచ్చినా, ఈరోజే యూఎస్‌డీ 30 బిలియన్ పెట్టుబడి లోటు ఉందన్నారు.

ఈ లోటును పూడ్చేందుకు క్యూర్, ప్యూర్, రేర్ జోన్‌ల అభివృద్ధికి పీపీపీలు ఇంధనంగా పనిచేస్తాయని డిప్యూటీ సీఎం వివరించారు. మెట్రోలు, సోలార్ పార్కులు, స్కిల్ హబ్‌లు వంటి రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు మార్గం వేస్తూ, మానవాభివృద్ధి, నెట్-జీరో లక్ష్యాలకు ప్రభుత్వ నిధులను కేటాయించే అవకాశం పీపీపీలు ఇస్తాయన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం, ఆతిథ్యం తెలంగాణ ఫిలాసఫీ అని వివరించారు.

పెట్టుబడిదారులను రాష్ర్ట ప్రభుత్వం తమ కుటుంబ సభ్యులుగా భావిస్తోందని చెప్పారు. ఇరవై ఏళ్ల క్రితం ఔటర్ రింగ్ రోడ్, ఒక దూరదృష్టి గల పీపీపీ అన్యుటి మోడల్ అన్నారు. ప్రైవేట్ భాగస్వాములు రికార్డు సమయంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ లక్షలాది మందికి ట్రాఫిక్ ఉపశమనం కలిగించడమే కాక, ఫార్మా కంపెనీలు, టెక్ హబ్‌లతో నిండి ఉన్న ఆర్థిక కారిడోర్లకు దారితీసిందనీ డిప్యూటీ సీఎం వివరించారు.

విజన్ ప్రైవేట్ మూలధనం ప్రధాన పాత్ర పోషించేలా రూపకల్పన చేశామని, మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు పీపీపీలు అందించేలా లక్ష్యంతో ఉందన్నారు. సరైన నిర్మాణంతో పీపీపీలు పెట్టుబడులను సమీకరించడానికి, రాష్ట్రాన్ని దీర్ఘకాల అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా తీసుకువెళ్లడానికి శక్తివంతమైన సాధనాలు అని పేర్కొన్నారు.

పాక్షిక రిస్క్ గ్యారంటీలు  నియామక సంబంధిత ప్రమాదాలను తగ్గిస్తాయని, ఔట్‌కమ్ -బేస్డ్ ఫైనాన్సింగ్  ఫలితాలకు అనుగుణంగా చెల్లింపులు అని, బ్లెండెడ్ క్యాపిటల్ పబ్లిక్, ప్రైవేట్ పెట్టుబడుల కలయిక, రెవెన్యూ-లింక్డ్ మోడల్‌లు  యూజర్ ఫీ ఉన్న రంగాల్లో వయబిలిటీ పెంపు వంటి అంశాలను వివరించారు. యూఎస్‌డీ 3 ట్రిలియన్ లక్ష్యం సాధించాలంటే, ప్రభుత్వ వనరులతో మాత్రమే సాధ్యం కాని భారీ పెట్టుబడి లోటును పూడ్చాలని, పీపీపీ ఆ లోటును పూడ్చే అత్యంత సమర్థవంతమైన మార్గం, పెట్టుబడులను సమీకరించడం, స్థిరత్వాన్ని కాపాడటం పీపీపీల ద్వారా సాకారం అవుతాయన్నారు. 

విజన్ డాక్యుమెంట్ సమిష్టి కృషి

‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ కొద్ది మంది గదిలో కూర్చొని చేసిన పని కాదని, విస్తృతమైన, వైవిధ్యమైన వర్గాల జ్ఞానం, ఆశయాలు కలిసిన సమిష్టి సృష్టి, కృషి అని, ఈ విజన్ పత్రం ఒక శాఖ పని కాదు, ఒక నిపుణుల బృందం రాసింది కాదని, నెలల తరబడి ఫీల్డ్ పర్యటనలు, ప్రజా చర్చలు, స్థానికుల అభిప్రాయాలు కలసి రూపొందిన తెలంగాణ జీవ పత్రం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ర్ట మంత్రులు లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారని, అధికారులు భూమ్మీదున్న వాస్తవాలను తీసుకొచ్చారని, చింతన నాయకులు, విద్యావేత్తలు మేధోపరమైన లోతు అంశాలను జోడించారని, అత్యంత ముఖ్యంగా రైతులు, యువత, వ్యాపారులు, కూలీలు వేలాదిగా తమ భవిష్యత్తు గురించి ఆశలు, సూచనలు పంచుకున్నారని తెలిపారు. సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం తెలంగాణ భవిష్యత్తు ఆశయాలను నిర్దేశిస్తుందని తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్‌తో ఆ ఆశయాలకు వేదికను నిర్మించామన్నారు.

విద్యుత్ సెషన్‌లో  వినియోగదారుడిగా కాకుండా, ఉత్పత్తిదారుడిగా మారాలనుకునే తెలంగాణను చూశానని, గ్రీన్ హైడ్రజన్, డిస్ట్రిబ్యూటెడ్ రిన్యూవబుల్స్, స్మార్ట్ గ్రిడ్స్ దారిని చూపించాయన్నారు. ఉత్పాదకత సెషన్‌లో భారత్ తదుపరి దూకుడు కేవలం కష్టపడి కాదు, తెలివిగా సిస్టమ్‌లు నిర్మించడం ద్వారా వస్తుందని ఏకాభిప్రాయం ఏర్పడిందని తెలిపారు. విజన్ డాక్యుమెంట్ మనందరిదని, తెలంగాణ సమ్మిళిత అభివృద్ధి అని స్పష్టం చేశారు.