03-11-2025 12:24:54 AM
అశ్వాపురం కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య
అశ్వాపురం, నవంబర్ 2, (విజయక్రాంతి): మణుగూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై అశ్వాపురం మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య మాట్లాడుతూ, మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యేకి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు లేదు అని తీవ్రంగా విమర్శించారు.
1980లో కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి స్థలదాత పిల్లారిశెట్టి హరిబాబు కుటుంబం స్థలం అందించగా, ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు చెమట చుక్క చుక్క కష్టపడి ఇటుక మీద ఇటుక పేర్చి ఒక అందమైన ఇందిరమ్మ భవనాన్ని నిర్మించారు. అదే భవనం నుండి కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేగా కాంతారావు గారు 2019లో గెలిచిన రెండో నెలకే పార్టీ మారి, అదే కార్యాలయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ భవనంగా మార్చుకోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.
మేము మా కష్టంతో నిర్మించుకున్న పార్టీ కార్యాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం పూర్తిగా చట్టబద్ధం. దానిపై మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుమాలిన చర్య. మీకు పార్టీ కార్యాలయం కావాలంటే మీరు స్థలం తీసుకుని మీ భవనం నిర్మించుకోండి, కానీ మా కాంగ్రెస్ కార్యాలయంపై హక్కు మాట్లాడే అర్హత ఎవరికీ లేదు అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బచ్చు వెంకటరమణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మచ్చ నరసింహారావు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు కోలా శశికాంత్, కొమ్ముగూడెం గ్రామ అధ్యక్షుడు కుంజ జాను, మురికిపూడి వెంకటేశ్వర్లు తదితరులుపాల్గొన్నారు.