29-09-2025 07:58:47 PM
కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి జోడు శ్రీనివాస్ ను గత సంవత్సరం ఒక వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది కాటారం గ్రామంలో ఒక రిసెప్షన్ కార్యక్రమంలో మరుగొని స్వామి అనే వ్యక్తిపై కాటారానికి చెందిన జోడు శ్రీనివాస్, కొండపర్తి రమేష్ అనే వ్యక్తులు ఇద్దరు కలిసి దాడి చేసిన ఘటనలో శ్రీనివాస్ ను అరెస్టు చేసినట్లు కాటారం పోలీసులు తెలిపారు. మరుగొని స్వామిని నానా విధాలుగా దుర్భాషలాడి, ఇష్టం వచ్చినట్లు కొట్టి, పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టి చంపే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న కొంతమంది ఆపే ప్రయత్నం చేశారు.
కాగా ఈ ఘటనలో జోడు శ్రీనివాస్, కొండపర్తి రమేష్ లు తప్పించుకుని పారిపోయారని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం జుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు జోడు శ్రీనివాస్ పై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. కొంత మంది వ్యక్తులు అక్రమ అరెస్టుగా చిత్రీకరించడం సరైనది కాదని పోలీసులు పేర్కొన్నారు.
అక్రమంగా అరెస్టు చేశారు : బిఆర్ఎస్ నేతల నిరసన
అకారణంగా పోలీసులు బిఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జి జోడు శ్రీనివాస్ ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి, నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బతుకమ్మ పండుగ అని చూడకుండా తన భర్త జోడు శ్రీనివాస్ ను పోలీసులు ఆదివారం అర్ధ రాత్రి తమ ఇంటి నుంచి బలవంతంగా లాక్కెళ్లారని జోడు శ్రీనివాస్ భార్య రమ్య అన్నారు. నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు రామిల్ల కిరణ్, నాయకులు జక్కు శ్రావణ్ , మానేం రాజబాబు, శ్రీశైలం, లక్ష్మీ చౌదరి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.