calender_icon.png 29 September, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్పల్లి మండలంలో వైభవంగా బతుకమ్మ పండుగ

29-09-2025 09:27:43 PM

మర్పల్లి (విజయక్రాంతి): బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో... అంటూ మర్పల్లి మండల కేంద్రంలో పాటు గ్రామాల్లో మారుమోగింది. సోమవారం తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మ పండుగను (సద్దుల బతుకమ్మ) మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రంగురంగుల పూలను తీసుకువచ్చి ఆకట్టుకునే విధంగా బతుకమ్మలను తయారు చేశారు. గునుగు, తంగేడి, బంతి, చామంతి పువ్వులతో బతుకమ్మలను పేర్చారు.  సాయంత్రం ఇండ్ల వద్ద బతుకమ్మలను పెట్టి మహిళలు బతుకమ్మ పాటలతో ఆటలు ఆడారు.  వేదపండితులతో బతుకమ్మలకు పూజలు నిర్వహించి, అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరినొకరు వాయినాలు ఇచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.