16-05-2025 12:03:36 AM
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి పాలనను చూసి బీఆర్‌ఎస్ నేతలు అసహనంలో ఉన్నారని, సీఎంను ఆడిపోసుకోవడమే వారి పనిగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. అడ్డగోలు సంపాదనతో ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు నిర్మించుకున్న బీఆర్‌ఎస్ నాయకులు.. ప్రజా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన మండిపడ్డారు.
గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి మధుసూదన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ఈసారి వరి ధాన్యం దిగుబడి వచ్చిందని, ఎన్నడు లేని విధంగా 8,724 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 70 శాతం ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు గాను ప్రభుత్వం రూ.6,720 కోట్లు చెల్లించిందని, రూ. 760 కోట్ల బోనస్ ఇవ్వబోతున్నామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
బీజేపీ అధ్యక్ష పదవి కోసమే ఈటల రాజేందర్, బండి సంజయ్ సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మిస్‌వరల్డ్ పోటీల వల్ల తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లుతోందని, తెలంగాణ సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేస్తున్నామన్నారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కృష్ణానదీని పూడ్చి భూ కబ్జాలకు పాల్పడ్డారని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపించారు.
ఆయన భూ కబ్జాపై రెవెన్యూ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. భానపాడు మండలం చండూరులో సర్వే నెంబర్ 57లో 2.19 ఎకరాల భూమిని కబ్జా చేశారని తేలిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్పారు. కలెక్టర్ విచారణ జరిపించి.. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్నారు. భావనపాడు మండలంలోని మారమునగాల గ్రామంలోని భూ కబ్జాపైనా విచారణ జరుగుతోందన్నారు.