15 April, 2026 | 2:14 AM

శంకర్పల్లిలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల నిలుపుదల

21-12-2025 04:56 PM

- ఎంపీ రఘునందన్ రావు చొరవతో నెరవేరిన ప్రజల ఆకాంక్ష

సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంత ప్రజల చిరకాల రవాణా కష్టాలను తీరుస్తూ, శంకర్పల్లి రైల్వే స్టేషన్‌లో కీలకమైన ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు కేంద్ర రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు తీసుకున్న ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల విన్నపాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లి, ఎక్స్‌ప్రెస్ రైళ్లు శంకర్పల్లిలో ఆగాల్సిన ఆవశ్యకతను ఎంపీ రఘునందన్ రావు వివరించారు.

దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం, క్రింది రైళ్లను శంకర్పల్లిలో నిలిపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ​రాయచూర్ - పర్బని ఎక్స్‌ప్రెస్, ​హైదరాబాద్ -విజయపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు శంకర్పల్లిలో ఆగనున్నాయి. ​సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాలకు, పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంపీ రఘునందన్ రావు చూపుతున్న చొరవ అభినందనీయం. ఈ సౌకర్యాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేక కృషి చేసిన ఎంపీ రఘునందన్ రావుకు ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని కొండాపురం జగన్ పేర్కొన్నారు.