15-12-2024 01:55:10 PM
హైదరాబాద్: జగిత్యాల జిల్లా ధరూర్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం నాడు భూమి పూజ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఆదివారం పట్టణంలోని పర్యటనలో భాగంగా జగిత్యాలకు వచ్చిన ఆమెకు ఘనస్వాగతం లభించింది. జగిత్యాల పట్టణం శివార్లలోని ధరూర్ చౌరస్తా వద్ద పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆమెకు పూలమాల వేసి స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం ధరూర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, ఇతర ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం జగిత్యాల బీఆర్‌ఎస్‌కు అడ్డా అని మరోసారి రుజువు చేసిందన్నారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఉద్యమ తెలంగాణ తల్లినే గ్రామగ్రామాన ప్రతిష్టించుకుంటామన్నారు. గెజిట్ ఇచ్చినా, కేసులు పెట్టిన భయపడేది లేదని చెప్పారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ చేసిన దాడిని ఎండగడతామని కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ప్రజలు తెలంగాణ తల్లి, బతుకమ్మను పోగొట్టుకున్నారని, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆమె ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఓట్లతో గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అసెంబ్లీ సమావేశాలకు ఎలా హాజరవుతున్నారని కవిత ప్రశ్నించారు.