calender_icon.png 16 September, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు బకాయిలు పక్కదారి పట్టిస్తుండ్రు

16-09-2025 01:25:45 AM

-కాంగ్రెస్ సర్కార్‌పై రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తీవ్ర ఆరోపణ

-కమిషన్ల కోసం అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు

-విద్యార్థుల ఫీజు బకాయిలకు నిధులు లేవా?

-ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేస్తే ఉద్యమం ఉధృతం

-పెండింగ్ బకాయిల కోసం ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్, సిటీ బ్యూరో, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ‘కమీషన్ల కోసం ప్రభుత్వం అప్పులు తెచ్చి మరీ కాంట్రార్లకు బిల్లులు చెల్లిస్తోంది.. కానీ, విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన ఫీజులు చెల్లించడానికి మాత్రం నిధులు లేవా?.. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవడం కాంగ్రెస్ సర్కార్‌కు ఇష్టం లేదు’ అంటూ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మంత్రులు అవినీతిలో కూరుకుపోయి, ఫీజు బకాయిలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

బడుగు విద్యార్థులు, వారి తల్లిందడ్రులను గోస పెడుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి. బీసీ విద్యార్థి సంఘాల రాష్ర్ట అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్‌ను ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించిన విద్యార్థులు, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ స్కాలర్‌షిప్స్ అంటూ నినదిస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయలేని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా, ఎన్ని పోరాటాలు చేసినా ఫీజుల విడుదలలో చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు.

42 శాతం రిజర్వేషన్లతో దేశానికే రోల్ మోడల్ అని చెప్పుకుంటూ, విద్యార్థుల ఫీజులు ఆపడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ర్టంలో అనేక కాలేజీలు మూతపడ్డాయని, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తే, రాష్ర్టవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో నేషనల్ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సి. రాజేందర్, ఆలంపల్లి రాంకోటి, అనంతయ్య, ఆశిష్, లింగయ్య యాదవ్, రవి యాదవ్, భాస్కర్, నిఖిల్ పటేల్ తదితర బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.