calender_icon.png 16 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రిపుల్‌ఆర్‌కు భూములు ఇవ్వం..

16-09-2025 01:02:13 AM

  1. రెండోసారి అలైన్‌మెంట్ ఎందుకు మార్చారు?
  2. పెద్దల భూములు కాపాడేందుకేనా!
  3. భూ నిర్వాసిత రైతుల ఆవేదన
  4. పాత అలైన్‌మెంట్‌నే అమలు చేయాలని డిమాండ్
  5. హైరదాబాద్‌లో హెచ్‌ఎండీఏ కార్యాలయం వద్ద ఆందోళన
  6. యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో నిరసనలు

హైదరాబాద్, సిటీ బ్యూరో/వికారాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రెండోసారి ప్రకటించిన అలైన్‌మెంట్ ప్రకారం ట్రిపుల్‌ఆర్‌కు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు. మొదటగా ప్రకటించిన అలైన్‌మెంట్ కాకుండా కొత్తగా మరో అలైన్‌మెంట్ ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దశాబ్దాలుగా భూమిని నమ్ముకుని జీవ నం సాగిస్తున్న చిన్న, సన్నకారు రైతులు.. ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్ మార్పుతో ఉన్నఫలంగా మొత్తం భూమి పోతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

ముందుగా ప్రకటించిన అలైన్‌మెంట్‌లో అనేకమంది రాజకీయ బడా నేతలు, వ్యాపారులు, ఆర్థికంగా బాగా కలిగిన వారి భూములు ఉన్నాయని, వారిని కాపాడే ఉద్దేశంతోనే ప్రభుత్వం రెండో అలైన్‌మెంట్‌ను ప్రక టించి పేదల జీవితాలతో ఆడుకుంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పాత అలైన్‌మెంట్‌ను అమలు చేయాలంటూ రైతుల తరఫు న మూడు రోజుల సమయం మాత్రమే ఇస్తున్నామని, ఆ తర్వాత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఈ క్రమంలోనే భూసేకరణపై అభ్యంతరాలను స్వీకరించేందుకు హెచ్‌ఎండీఏ విధించిన గడువు చివరి రోజు కావడంతో సోమవారం పెద్ద సంఖ్యలో రైతులు అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వారి గోడు వినేం దుకు, అభ్యంతరాలు స్వీకరించేందుకు ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారుల తీరుకు వ్యతిరేకంగా కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

తమ అభ్యంతరాలు చెప్పడానికి వస్తే ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరని, ఇదేక్కడి అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలిపారు. రైతుల ఆందోళన నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యగా హెచ్‌ఎండీఏ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, టెన్షన్ వాతావరణం నెలకొంది. 

వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో..

వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట, పూ డూరు మండలాల రైతులు గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. సోమవారం నవాబ్‌పేట మండలానికి చెందిన ట్రిపుల్ ఆర్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులు వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు తమ సమస్యలపై వినతిపత్రాన్ని సమ ర్పించారు.

ఈ సందర్భంగా  పలువురు రైతులు మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్ పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని, కొత్తగా మార్పులు చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని తెలిపారు. ఈ మార్పులు కేవలం కొంతమంది పెద్దలకు మేలు చేకూర్చేందుకే చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఎన్ శుభప్రద్ పటేల్, బిజెపి నాయకులు వడ్ల నందు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని దేవిరెడ్డి బంగ్లా వద్ద మునుగోడు రహ దారిపై భూ నిర్వాసితులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశా రు. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై రీజినల్ రింగు రోడ్డు నిర్మిస్తే తమ కుటుంబాలు వీధిన పడతాయన్నారు.