16-09-2025 12:51:36 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి) : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో సోమవారం పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్‌తో పాటు తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు ప్రచురించడం, ప్రసారం చేసినందుకు గాను కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాములపై కూడా ఆయన ఈ దావా దాఖలు చేశారు.
తన న్యాయవాది పీ.విశ్వ జననీ ద్వారా ఈ కేసును నమోదు చేసిన కేటీఆర్, ఫిర్యాదులో ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు రూ.10కోట్లు చెల్లించాల న్నారు. 2025 ఆగస్టు 8న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో తెలంగాణ ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక అవకతవకలకు తనను ముడిపెట్టారని వాపోయారు.
ఈ వ్యాఖ్యలు ఏబీఎన్ తెలుగు, ఎన్టీవీ, టీవీ5, వీ6, ఏఎన్‌ఎన్ తెలుగు వంటి టీవీ చానెళ్లు, అలాగే ఇండియా టుడే, ఎన్డీటీవీ, డెక్కన్ హెరాల్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి డిజిటల్ ప్లాట్‌ఫాముల్లో, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్, ఫేస్‌బుక్/ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థల్లో విస్తృతంగా ప్రసారమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశించినవని పేర్కొన్నారు.
2025 ఆగస్టు 11న లీగల్ నోటీసు పంపినప్పటికీ, బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో, న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పలేదని తెలిపారు. బండి సంజయ్ కేవలం రాజకీయ కక్షతో ‘విపరీతమైన నిందారోపణలతో నీచమైన దుష్ర్పచారానికి’ పాల్పడ్డారని కేటీఆర్ ఈ ఫిర్యాదులో ఆరోపించారు.
అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి ఇటువంటి బాధ్యతారహితమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజా ప్రతినిధుల గౌరవానికి, విశ్వసనీయతపై తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఈ ఫిర్యాదు నొక్కి చెప్పారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాములు, మీడియా పోర్టల్ల నుంచి పరువు నష్టం కలిగించే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించాలని కూడా ఆయన కోరారు. కేటీఆర్ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం డిసెంబర్ 15న విచారణకు హాజరుకావాలని కేంద్రమంత్రికి సమన్లు జారీ చేసింది.