10-10-2025 12:00:00 AM
మణికొండ, అక్టోబర్ 9 : ప్రభుత్వం పెంచిన బస్సు ఛార్జీలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) రాష్ట్ర శాఖ ఇచ్చిన ’చలో బస్ భవన్’ పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి, పలువురు ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు. నిర్బంధాలను ఛేదించుకుని బస్ భవన్ వద్దకు చేరుకున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.
ఈ నిరసనలో భాగంగా మణికొండ మున్సిపాలిటీ నుంచి బీఆర్‌ఎస్ స్థానిక అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, అందే లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, సింగదాసరి శ్రీబాబు సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరంతా పుప్పాలగూడలో హరీశ్ రావును కలిసి, ఆయనతో పాటు మెహిదీపట్నం వద్ద స్వయంగా బస్సు టిక్కెట్లు కొనుగోలు చేసి బస్ భవన్కు చేరుకున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు పేరిట పురుషుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని, రౌండ్ ఫిగర్, టోల్ గేట్, విద్యార్థి పాసులు, పండుగల పేరిట పలుమార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న శాసనసభ్యులు, సీనియర్ నాయకులను హౌస్ అరెస్ట్ల పేరిట అడ్డుకోవడం దారుణమని వారు పేర్కొన్నారు. అనంతరం బస్ భవన్ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కార్యకర్తలను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేయడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
నేతల ముందస్తు అరెస్టు
ఎల్బీనగర్, అక్టోబర్ 9 : బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై బస్ చార్జీలు పెంపును నిరసిస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం బస్ భవన్ ముట్టడికి సిద్ధమయ్యారు. ఇందులో లో భాగంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణితో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రజలతో ప్రయాణించి, ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకున్నారు.
మీడియా సమావేశం పాల్గొని బస్ భవన్ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. బస్ భవన్‌కి బయలుదేరిన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సబితారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవిని మార్గమధ్యలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అంబర్ పేట దగ్గర విడుదల చేయగా అనంతరం, వారు బస్ భవన్ దగ్గరకు వెళ్లారు.