14-11-2025 02:43:31 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పును పార్టీ గౌరవిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు(BRS Working President KTR) శుక్రవారం అన్నారు. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తూనే ఉంటామన్నారు. నిర్విరామంగా కష్టపడిన కేసీఆర్ బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా కష్టపడిందని పేర్కొన్నారు. మాగంటి సునీత పెద్దఎత్తున పోరాటం చేశారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల వాదన, వేదనను ప్రభుత్వం ముందు పెట్టడంలో బీఆర్ఎస్ తీవ్రంగా పనిచేస్తోందని కేటీఆర్ తెలిపారు.
ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలంతా చూశారని ఆయన వివరించారు. ఈ ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలం ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్నది కేవలం బీఆర్ఎస్సే అని కేటీఆర్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమయ్యామని తెలిపారు. నిరాశపడాల్సిన అవసరం లేదని చెప్పిన కేటీఆర్ ఇంకా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. "మేము ప్రజలతో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావును ముఖ్యమంత్రిగా చేయడానికి మా పోరాటాన్ని కొనసాగిస్తాము" అని కేటీఆర్ అన్నారు. బీజేపీ పనితీరును ప్రస్తావిస్తూ, ఒక జాతీయ పార్టీ గతంలో సింగిల్ డిజిట్ నుంచి డిపాజిట్ కోల్పోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.