08-03-2025 02:27:54 AM
గజ్వేల్, మార్చి 7 : బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నామంటూ బిజెపి పార్టీని ఎమ్మెల్సీ కవిత అంటుందని, బిఆర్‌ఎస్ పార్టీకి బీసీల మీద ప్రేమ ఉంటే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీలకు ఇవ్వాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం జన ఔషధీ దివస్ ను పురస్కరించుకొని గజ్వేల్ లో ప్రధానమంత్రి జన్ ఔషధీ కేంద్రాన్ని ఆయన సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీలకు, శాసనసభ, మండలి లో ప్రతిపక్ష నేతగా బీసీలను నియమించేలా కెసిఆర్ తో మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్సీ కవిత బీసీల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు.
గడిచిన పట్టభ ద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి బీసీకి,మరొకటి ఓసి కి కేటాయించడంతో బీసీల అభివృద్ధి పట్ల బీజేపీ చిత్తశుద్ధి ప్రజలకు అర్థమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా 10 జవహర్ నవోదయ పాఠశాలలను మంజూరు చేసి విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని, అలాగే వైద్యం కార్పొరేట్ కోరల్లో చిక్కుకొని పేదలకు మందులు కొనుగోలు భారంగా మారిందన్నారు.
ప్రజలకు మందులను అతి స్వల్ప దొరకు అందించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రాలను దేశవ్యాప్తంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. జెనరిక్ మందులను వినియోగించుకోవాలని, సాధారణ మందుల ధరలో 10 శాతం ధరకే నాణ్యమైన మందు లు జన ఔషధీ కేంద్రాల్లో ప్రజలకు లభిస్తున్న అన్నారు.
గజ్వేల్లో జన ఔషధీ కార్య క్రమంలో రాష్ట్ర నాయకులు ఏర్పుల రమణ, జిల్లా అధ్యక్షుడు వైరి శంకర్, బిజెపిమండల అధ్యక్షుడు మనోహర్ యాదవ్, ఉప్పల మధు ఎల్లురామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, బిజేపి సీనియర్ నాయకులు నలగామ శ్రీను, జస్వంత్ రెడ్డి, ఐటి సెల్ కన్వీనర్ వెంకటరమణ, అడ్వకేట్ వినోద్ కేతోజి, కో కన్వీనర్లు బండారు మహేష్, సురేష్, బిజేపి పట్టణ కార్యకర్తలు పాల్గొన్నారు.