calender_icon.png 16 November, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో రక్షణ చర్యలు పాటించాలి

08-03-2025 02:26:36 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం అసిఫాబాద్,మార్చి 7(విజయ క్రాంతి):  వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత నుండి రక్షణ చర్యలు పాటించాలని  కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి వేసవిలో ఎండ తీవ్రత నుండి రక్షించుకునేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలంలో ఎండ తీవ్రత నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మార్చి మొదటి వారం నుండి ఎండ తీవ్రత అధికమవుతున్నందున ఉష్ణోగ్రత నుండి రక్షించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ దిశగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

వ్యవసాయ రైతులు, కూలీలు, ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు పనులు ముగించుకోవాలని, ఎట్టి పరిస్థితులలో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకూడదని, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి ఎండ తీవ్రత తగ్గిన తర్వాత పనులు చేసుకోవాలని తెలిపారు. పని ప్రదేశాలలో శుద్ధమైన త్రాగు నీరు, ఓ. ఆర్. ఎస్. ప్యాకెట్లు, నీడ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

బయటకు వెళ్లేటప్పుడు రక్షణ కొరకు తలకు వేడి గాలులు తగలకుండా రుమాలు / చున్నీలు చుట్టుకోవాలని, గొడుగులు వెంట తీసుకువెళ్లాలని, చిన్నపిల్లల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అంగన్వాడీలకు వచ్చే చిన్నపిల్లలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికుల కొరకు తాత్కాలిక బస్సు షెల్టర్లు ఏర్పాటు చేసి త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని తెలిపారు.

మున్సిపా లిటీలు, మండల కేంద్రాలలో, గ్రామాలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, పంచాయితీ కార్యదర్శులు, అంగన్వాడీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తల వద్ద ఓ. ఆర్. ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు తీసుకోవలసిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఎవరైనా వడదెబ్బకు గురైనట్లయితే వెంటనే వారిని సమీప ఆస్పత్రు లకు తరలించి ప్రధమ చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

అటవీ ప్రాంతాలలో వన్యప్రాణుల కొరకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులకు సూచించారు.  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్, రవాణా శాఖ అధికారి రామ్ చందర్, విద్య శాఖ, విద్యుత్ శాఖ, ఆర్. టి. సి. అధికారులు, మున్సిపల్ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.