04-11-2025 12:00:00 AM
							5 రోజుల పాటు వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
రేగొండ, నవంబర్ 3 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని కొండలపై కొలువై ఉన్న శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు నేటి నుండి నవంబర్ 8 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి.ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాక రాష్ట్ర నలుమూలల నుండి స్వామి వారి దర్శనం కొరకు లక్షలాదిమంది తరలివస్తారు.
బ్రహ్మోత్సవాల వివరాలు..
మంగళవారం నుండి స్వామివారి ఉత్సవమూర్తులు తిరుమలగిరి గ్రామం నుండి కొండకు తరలింపు, సాయంత్రం కల్యాణోత్సవం. 5వ తేది మంగళవారం అభిషేకం, గండం దీపం, అలివేలు,మంగమ్మ కు ప్రత్యేక పూజలు, గుర్రపు, ఏనుగు వాహనాలు తిరుగుట. 6వ తేదీ బుధవారం మొక్కుబడులు, పల్లారపు బండ్లు. 7వ తేది గురువారం ప్రత్యేక పూజలు, మొక్కుబడులు.8వ తేది శుక్రవారం పల్లారపు బండ్లు, మొక్కుబడులు, సాయంత్రం 4.గంటలకి స్వామివారి తిరుగు ప్రయాణం.
భక్తులందరికీ స్వామివారి దర్శనం సులభతరం చేశాం
బుగులోని జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు సహకారంతో భక్తుల రద్దీకి అనుగుణంగా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించాం. ప్రతి భక్తుడు స్వామివారి దర్శనం ప్రశాంతంగా, సులభంగా చేసుకునేందుకు తగు చర్యలు తీసుకున్నాం. భక్తులు సహకరించి ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం.
- జాతర చైర్మన్ గంగుల రమణారెడ్డి
అన్ని మౌలిక వసతులు కల్పించాం
జాతరకు వచ్చే భక్తులకు అనేక మౌలిక వసతులను మెరుగుపరిచాం. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాం. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ ఐదు రోజుల ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
- ఆలయ ఈవో, బిల్ల శ్రీనివాస్