06-05-2025 12:00:00 AM
సాకిచెరువు, బంధం కొమ్ము విస్తరణ పనులు పరిశీలన
పటాన్ చెరు, మే 5 :జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పటాన్ చెరు పట్టణంలో వ్యాపారస్తులకు, స్థానికులకు నష్టం వాటిల్లకుండా ఫ్లై ఓవర్ నిర్మించాలని కోరుతూ కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వినతిపత్రం అందించారు.
సోమవారం బీహెచ్‌ఈఎల్ వద్ద రూ.136 కోట్లతో నూతనంగా నిర్మించిన బీహెచ్‌ఈఎల్ - లింగంపల్లి నూతన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి గడ్కరీని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి విస్తరణ మూలంగా పటాన్ చెరు పట్టణంలో ఎదురయ్యే ఇబ్బందులను వినతి పత్రం ద్వారా కేంద్ర మంత్రికి అందించారు.
విస్తరణ మూలంగా పటాన్ చెరు పట్టణంలో వ్యాపార సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రధాన వ్యాపార కేంద్రాలతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం విస్తరణ మూలంగా కూల్చివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. అనంతరం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్, లాలాబావి, పెద్ద చెరువు మీదుగా బంధం కొమ్ము వరకు చేపడుతున్న రహదారి విస్తరణ పనులను పరిశీలించారు.
బంధం కొమ్ము పరిధిలో విద్యుత్ స్థంబాల తరలింపు, నూతన లైన్ల ఏర్పాటు కోసం గతంలో రూ. 4 కోట్ల 70 లక్షలను కేటాయించినట్లు తెలిపారు. అలాగే పటాన్ చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువులో రూ.60 లక్షల వ్యయంతో చేపడుతున్న చెట్ల పొదల తొలగింపు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
రూ.7 కోట్లతో చెరువు సుందరీకరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, హెచ్‌ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ ఎఫ్ ఆర్ ఓ ప్రణీత్ కౌర్, డిఆర్‌ఓ రవి కిరణ్, తహశీల్దార్ వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, విద్యుత్ శాఖ డీఈ భాస్కర్ రావు, మున్సిపల్ ఇంజనీరింగ్ డీఈ వెంకటరమణ, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.