13-12-2024 01:33:40 AM
ముషీరాబాద్, డిసెంబర్ 12: బంగారం వ్యాపారి ఇంట్లో దుండగులు చొరబడి 2.5 కిలోల బంగారం, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిన సంఘటన నగరంలోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కలకత్తాకు చెందిన రంజిత్ గౌరాయి నగరంలో బంగారం వ్యాపారం చేసతూ దోమలగూడలోని అరవింద్ కాలనీలో నివాసముంటున్నాడు.
ఆయన నివాసంలో గురువారం తెల్లవారుజామున దాదాపు 10 మంది దుండగులు సినీఫక్కీలో ఇంట్లో చొరబడి కత్తులు, తుపాకులలో ఇంట్లో ఉన్నవారిని బెదిరించి 2.5 కిలోల బంగారం, ఖరీదైన ఫోన్లు, సీసీటీవీ డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితుడు రంజిత్ గౌరాయి దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కాగా రంజిత్ గౌరాయ్ వద్ద దాదాపు 40 నుంచి 50 మంది పనిచేస్తున్నారని.. నగరంలోని బంగారు దుకాణాలలో ఆర్డర్స్ తీసుకొని నగలు తయారు చేసి ఇచ్చేవారని తెలిసింది. ఇంట్లో చొరబడి బంగారం దొంగిలించింది గుర్తుతెలియని వ్యక్తులా, లేక ఆయన వద్ద పనిచేసేవారే చోరీకి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
8 బృందాల సహాయంతో దుండగులను పట్టుకునేందు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పట్టపగలే దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.