13 July, 2026 | 2:42 AM

అయితే సికింద్రాబాద్.. లేదంటే కరీంనగర్

10-06-2024 12:39 AM

ఎన్డీయే పాలనలో ఈ రెండు స్థానాలను వరిస్తున్న కేంద్రమంత్రి పదవులు

తాజాగా మోదీ 3.0 సర్కారులో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు ఛాన్స్

వాజ్ పేయి హయాంలో దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావుకు అవకాశం

నరేంద్ర మోదీ పాలనలోనూ కొనసాగుతున్న సంప్రదాయం

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): కేంద్రం లో ఎన్డీయే పాలనకు రాష్ట్రంలో సికింద్రాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలకు ప్రత్యేక అనుబంధం ఉంది. సెంట్రల్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన ప్రతీసారి ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో గెలిచిన వారిలో ఒకరికి కానీ, లేకుంటే ఇద్దరికి కానీ మంత్రి పదవి దక్కుతుందనేది నానుడిగా మారింది.

1998 నుంచి తెలంగాణలోని బీజేపీ కేంద్రమంత్రుల జాబితాను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది.  తాజాగా మోదీ 3.0 సర్కారులో కూడా సికింద్రాబాద్ నుంచి గెలిచిన జీ కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి విజయం సాధించిన బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో కేంద్రంలో ఎన్డీయే సర్కారు వస్తే.. ఈ రెండు నియోజకవర్గాలకు అదృష్టం వరించినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

1998, 1999లో వాజ్ పేయీ హయాంలో..

1998లో మిత్రపక్షాలతో బీజేపీ ఎన్డీయే ప్రభుత్వాన్ని తొలిసారిగా ఏర్పాటు చేసింది. వాజ్ పేయీ ప్రధాని అయ్యారు. ఆ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, కరీంనగర్ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు గెలిచారు. అయితే ఇందులో బండారు దత్తాత్రేయకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్నాడీఎంకే మద్దతును ఉపసంహరించుకోవడంతో 13నెలలకే వాజ్ పేయీ ప్రభుత్వం పడిపోయింది. దీంతో 1999లో మరోసారి ఎన్నికలు రాగా.. అప్పుడు తెలంగాణ నుంచి ముగ్గురు బీజేపీ ఎంపీలు గెలిచారు. సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, కరీంనగర్ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు, మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి విజయం సాధించారు. వీరిలో దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు ఇద్దరికీ కేంద్ర సహాయ మంత్రి పదవులు దక్కాయి.

2014, 2019లో మోదీ సారథ్యంలో.. 

2014 ఎన్నికల్లో తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి బీజేపీ తరఫున బండారు దత్తాత్రేయ మాత్రమే గెలిచారు. దీంతో ఆయన్ను కేంద్రమంత్రి పదవి వరించింది. 2019లో రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున ఏకంగా నలుగురు ఎంపీలు గెలిచారు. సికింద్రాబాద్ నుంచి జీ కిషన్ రెడ్డి, కరీంనగర్‌లో బండి సంజయ్, నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్‌లో సోయం బాపూరావు విజయం సాధించారు. కానీ వీరిలో సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారు. అయితే అన్ని పర్యాయాలు కూడా సికింద్రాబాద్ స్థానానికే అవకాశం దక్కడం గమనార్హం.

3.0 సర్కారులో ఇద్దరికీ అవకాశం

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని అందుకుంది. తెలంగాణలో ఏకంగా ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు.  మళ్లీ సికింద్రాబాద్, కరీనంగర్ స్థానాలే ఎంపిక కావడం గమనార్హం. దీంతో ఆయా స్థానాల నుంచి గెలిచిన కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రిగా, బండి సంజయ్ తొలిసారిగా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దేశం లో 2024తో కలిపి మొత్తం ఐదుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈ ఐదు సార్లు కూడా కేంద్రమం త్రులు  అయిన వాళ్లు.. ఈ సికింద్రాబాద్, కరీంనగర్ నియోజకవర్గాలకు చెందిన వారే. అయితే ఇందులో సికింద్రాబద్ నుంచి గెలిచిన వారికి ఐదుసార్లు, కరీంనగర్‌కు రెండు సార్లు కేబినెట్‌లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. కేం ద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే సికింద్రాబా ద్, కరీంనగర్‌లో కచ్చితంగా ఒక స్థానానికి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందనే చర్చ సాగుతోంది.