బుక్క చిట్టీలతో వడ్ల కొనుగోళ్లు… రైతులకు నష్టం?
పట్టించుకోని అధికారులు.
బుక్క చిట్టీలతో వడ్ల కొనుగోళ్లు అంటే అధికారిక రసీదులు లేకుండా ధాన్యం సేకరించడం. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. ఈ విధంగా కొనుగోలు చేస్తే రైతులకు మద్దతు ధర, బోనస్ సక్రమంగా అందకపోవచ్చు.
బిజినేపల్లి, మే 18: యాసంగి సీజన్‌లో రైతులు పండించిన వడ్లను స్థానిక రైస్ మిల్లర్లు అధికారిక పత్రాలు, బిల్లులు లేకుండానే కేవలం “బుక్క చిట్టీల” ఆధారంగా కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మండలంలోని వట్టెం గ్రామానికి చెందిన ఓ రైస్ మిల్లర్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రం వద్దే రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నాడని రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన తుల్జా భవాని రైస్ మిల్లు యాజమాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా పెద్ద మొత్తంలో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ శాఖ అధికారులు రైతుల పంట విస్తీర్ణం, పంట వివరాలు, పాస్‌బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా వంటి వివరాలు పరిశీలించి టోకెన్లు జారీ అనంతరం సెంటర్ ఇన్‌చార్జి తేమ, నాణ్యత పరిశీలించి సంచులు అందజేస్తారు.
సివిల్ సప్లై అధికారుల నుంచి అలాట్‌మెంట్ లెటర్ వచ్చిన మిల్లర్లకే ధాన్యం తరలించే అనుమతి ఉంటుంది. ధాన్యం తూకం అనంతరం రైతులకు కొనుగోలు పత్రం జారీ చేసి, మద్దతు ధరతో పాటు బోనస్ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
అయితే, వట్టెంలో ఈ నిబంధనలేవీ పాటించకుండా కేవలం బుక్క చిట్టీల ద్వారానే ధాన్యం కొనుగోలు జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారిక రసీదులు లేకుండా కొనుగోళ్లు చేస్తే రైతులకు మద్దతు ధర, బోనస్ సక్రమంగా అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.






