ప్రచారం తుది ఘట్టం.. విజయానికి పోరాటం
ఖమ్మం తమదేనన్న ధీమాలో ఆయా పార్టీలు
గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న నేతలు
ఖమ్మం, మే 10 (విజయక్రాంతి): మరి కొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనున్నది. చివరి అంకంలో అభ్యర్థులు, అగ్రనేతలు అలుపెరగకుండా శ్రేణుల్ని ఉరుకులు పెట్టిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ పార్టీ తరపున హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు కొనసాగుతుండటం, వామపక్షాలు కాంగ్రెస్‌కు మద్దతు తెలపడంతో వారికి విజయం నల్లేరు మీద నడకేనని చెప్పుకొంటున్నారు.
అటు కేసీఆర్ పర్యటనతో ఖమ్మంలో పరిస్థితులు పూర్తిగా మారాయని, బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు విజయావకాశాలు మరింత పెరిగాయని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొంటున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు విజయం కోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వంటి ప్రముఖులు ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, మందక్రుష్ణ మాదిగ మద్దతుతో ఆయన ప్రచారంలో ముందున్నారు.






