29-11-2025 01:26:55 AM
- ట్రాఫిక్ పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్..
- సొంత మొబైల్స్‌లో ఫొటోలు తీయడమేంటని ప్రశ్న
- హోంశాఖకు నోటీసులు.. 4 వారాల్లో కౌంటర్ వేయాలని ఆదేశం
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 28 (విజయక్రాంతి): వాహనదారులపై ఇష్టారాజ్యంగా చలాన్లు విధిస్తున్న హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిబంధనల పేరుతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టింది. ముఖ్యంగా పోలీసులు తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్ల ద్వారా ఫొటోలు తీసి చలాన్లు వేయడంపై న్యాయస్థానం సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర హోంశాఖకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
ట్రాఫిక్ పోలీసుల తీరుపై రాఘవేంద్ర చారి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రాఫిక్ పోలీసులు అధికారిక కెమెరాలతో కాకుండా, తమ సొంత మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసి తనకు మూడు చలాన్లు వేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. అసలు చలాన్ ఎన్‌ఫోర్స్ మెంట్ విధానం ఎలా అమలవుతోందో పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
మరోవైపు, ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం ఇస్తున్న రాయితీలపైనా హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించి, ఆ తర్వాత అందులో భారీగా రాయితీలు ఇవ్వడం సరైన పద్ధతి కాదని అభిప్రా యపడింది. ఇది ట్రాఫిక్ క్రమశిక్షణారాహిత్యాన్ని మరింత పెంచుతుంది అని రెండు రోజుల క్రితం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
డిసెంబర్ 9కి వాయిదా
ఈ-చలానా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలని, వాహనదారులు చేసిన ఉల్లంఘనలు స్పష్టంగా తెలిసేలా చలాన్ జారీ అయ్యే వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఆ దిశగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను డిసెం బర్ 9వ తేదీకి వాయిదా వేసింది.