calender_icon.png 14 November, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూరగాయలు కొనలేం.. మాంసం వండలేం

14-11-2025 01:29:08 AM

  1. ధరల మంటతో సామాన్యుడి కన్నీటి వంట

నడ్డి విరుగుతున్న సామాన్య ప్రజలు

నకిరేకల్, నవంబర్ 09 : “ఏమి కొనేటట్టు లేదు ఏమి తినేట్లేదు నాగులో నాగన్న.. ఈ ధరల మీద మన్ను పడా నాగులో నాగన్న” అన్న చందంగా రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్న కూరగాయ లు, మాంసం ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుగుతోంది. “అడగపోతే అడిమి, కొనబోతే కోరిమీ” అన్నట్లుగా సామాన్యుడి పరిస్థితి తయారైంది.

గతంలో అంగడికి వెళ్తే రూ.500తో సంచి నిండా వచ్చే కూరగాయలు, ఇప్పుడు కనీసం సగం కూడా రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, దిగుమతి లోపాల కారణంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో, కనీసం కూరగాయల వంట కూడా వండుకోలేని దీనస్థితి నెలకొంది. దీంతో సామాన్యుడి వంట కన్నీటి వంటగా మారిందని పలువురు వాపోతున్నారు.

మాంసం కూడా ముద్ద కాని పరిస్థితి

కూరగాయల మాదిరిగానే మాంసం ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయి. తాజా ధరల ప్రకారం, కిలో మటన్ రూ.850 ఉండగా, చికెన్ రూ.200 పలుకుతోంది. చేపల ధరలు కూడా భారీగా పెరిగాయి. అత్యధికంగా కొర్రమేను రూ.400, బురద మట్టలు రూ.350, బొచ్చ రూ.200 వరకు విక్రయిస్తున్నారు.

వారానికి ఒక్కరోజు కూడా పిల్లాపాపలతో మాంసాన్ని వండుకునే పరిస్థితి లేదని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను ప్రభుత్వం తక్షణమే నియంత్రించాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ధరల పట్టిక

మునుగకాయలు  -రూ. 160

చిక్కుడు    -రూ. 160

క్యాప్సికం    --రూ.120 

గోకరకాయ    -రూ.100 

కాకరకాయ, వంకాయ, దొండకాయ, బెండకాయ (ప్రతి ఒక్కటి) -రూ. 80 కిలో

 ఆలుగడ్డ, పచ్చిమిర్చి, సొరకాయ (ప్రతి ఒక్కటి)  -రూ. 60 కిలో

మటన్ --రూ. 850 కి.లో

చికెన్ -రూ.200.కిలో

 బురద మట్టలు -రూ. -350 

 కొర్రమేను -రూ. -400 

బొచ్చ -రూ. 200 

రవ్వ (చేపలు) -రూ.- 150 

 పంపేట్లు (చేపలు) - -రూ. 80 

 డజన్ గుడ్లు --రూ. 74