27-07-2025 01:30:00 AM
అరుదైన నాణేలు, కరెన్సీ నోట్లను కాపాడిన మహేశ్
డిజిటల్ యుగం, సోషల్ మీడియాలో మునిగిపోతున్న నేటి తరానికి కాగితం నోట్లు, లోహ నాణేలు, వాటి వెనక దాగున్న రాజ్యాలు, సంస్కృతులు, సంప్రదాయాలు నేటి తరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నోట్లు, నాణేలు కేవలం ద్రవ్య మారక సాధనాలే కాదు.. అవి ఒక దేశపు సామాజికి, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను మోసుకెళ్లే సజీవ పత్రాలు. ఒకే రూపాయి నాణెం కూడా వేర్వేరు సంవత్సరాల్లో, వేర్వేరు గుర్తులతో వస్తూ ఆ కాలపు ప్రభుత్వ మార్పుల కథను సూచిస్తుంది.
బ్రిటిష్ కాలం, సంస్థానాల యుగం, స్వాతంత్య్రానంతర దశ, ప్రతి దశలో ముద్రితమైన చిహ్నాలు, చక్రాలు, జాతీయ నాయకుల చిత్రాలు కాలసాక్ష్యాలుగా నాణెలు, నోట్లు నిలుస్తాయి. నాణాలపై ఉన్న లోహ మిశ్రమాలు, బరువుల మార్పులు దేశ ఆర్థిక పరిస్థితులను, లోహాల దిగుమతి, ఎగుమతి ధోరణులను తెలియజేస్తాయి.
ప్రభుత్వాల మింట్లు విడుదల చేసే స్మారక నాణేలలో (కామెమొరేటివ్ కాయిన్స్) సమకాలీన చరిత్ర నమోదు అవుతుంది. నాణేల, కరెన్సీల సేకరణాదారులకు ఇవి భవిష్యత్తులో విలువైన ఆస్తులవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పాత బంగారు, వెండి నాణేలపై ఇంకా తెలియని కథనాలు దాగి ఉన్నాయి అంటున్నారు సేకరణదారులు.
33 సంవత్సరాలుగా నాణేల సేకరణ
బ్రిటీష్ కాలంలో కరెన్సీ ఎలా ఉంటుందో, నైజాం కాలం నాటి నాణేలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే సామలేటి మహేశ్‌ను సాంప్రదించాల్సిందే. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన సామలేటి మహేశ్ 33 సంవత్సరాలుగా నాణేలు, కరెన్సీ నోట్లను సేకరిస్తూన్నారు. ఆయన ఇంతవరకు ఇతర ఏ దేశానికి వెళ్లలేదు. కానీ 100 దేశాల కరెన్సీ, 70 దేశాల నాణేలు ఆయన వద్ద ఉన్నాయి.
ఇటీవల రద్దైన వేయి రూపాయల నోటును రేపటి తరం చూడలేదన్న బాధలేకుండా చేశాడు. 1994 సిద్దిపేటలోని తన కుటుంబం ఇల్లు మారుతున్న సందర్భంలో ఇంట్లో గల పాత ఇనుప పెట్టెను మోసుకెళ్తున్న క్రమంలో అందులో నుంచి మూటగా కిందపడిన నాణేలను చూసి ఆకర్షితుడైన మహేశ్ అనేక దేశాలకు చెందిన కరెన్సీ, నాణేలను సేకరించాడు.
దక్షిణాఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నేపాల్, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్, పాకిస్తాన్, భూటాన్, తదితర దేశాల చిహ్నాలతో కూడిన నాణేలను తన వద్ద భద్రపరుచుకున్నాడు. అప్పటినుంచి నాణేలను, కరెన్సీ నోట్లను సేకరించడంలో తనకున్న అసక్తిని చాటుతూ పలుమార్లు పాఠశాలలో ప్రదర్శనలు నిర్వహించారు. దాంతో ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరం, భవిష్యత్ తరం విద్యార్థులకు తెలియజేయాలన్నదే తన ఉద్దేశం.
మ్యూజియంకు ఇవ్వాలని ఉంది..
సామలేటి మహేష్, నాణేలు, కరెన్సీ నోట్ల సేకరణదారుడు.
భవిష్యత్తు తరాలకు చరిత్రగా నా అభిరుచి మిగలాలన్నది నా ఆశయం. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల కరెన్సీ నోట్లను, నాణేలను సేకరించాలనే లక్ష్యంతో ప్రయత్నం సాగిస్తున్నాను. భవిష్యత్తులో భారీ ప్రదర్శన నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాను. సిద్దిపేటలో మ్యూజియం ఏర్పాటు చేస్తే దానికి నా దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలను అందజేయాలని కోరిక ఉంది
. ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చి గత చరిత్రను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలన్న కోరిక ఉంది. చరిత్ర తెలుసుకున్నవారే భవిష్యత్తును సరిదిద్దగలరు. ఫోటోగ్రఫీ, నాణేల సేకరణ ఫ్యాషన్‌గా చేస్తున్నాను. ఇవి రెండు అంశాలు కూడా చరిత్రకు ఆనవాలుగా ఉంటాయి. తల్లిదండ్రుల, కుటుంబసభ్యుల, మిత్రులు, పరిచయస్తుల సహకారం మరువలేనిది. భవిష్యత్తులో మరిన్ని దేశాల కరెన్సీ నోట్లు, నాణేలను సేకరిస్తాను.
- మంద జనార్దన్, విజయక్రాంతి సిద్దిపేట