calender_icon.png 27 July, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజరికపు రాజసం రాచకొండ

27-07-2025 01:30:00 AM

  1.    700 ఏండ్లనాటి చారిత్రక ఆనవాళ్లు 
  2. ప్రత్యేక ఆకర్షణగా సంకెళ్ల బావి
  3.    35 వేల ఎకరాలు.. 300 చెరువులు 
  4.   150 ఆలయాలు.. 100కు పైగా శివాలయాలే..
  5. కోట చుట్టూ 40 కిలోమీటర్ల పొడవైన రాతి గోడ
  6. కాకతీయుల పతనంతో రేచర్ల పద్మనాయకుల స్వతంత్ర రాజ్యం

చుట్టూ ఎత్తయిన కొండలు.. శత్రు దుర్భేద్యమైన కోట.. పురాతన ఆలయాలు.. మంత్రముగ్ధులయ్యేలా శిల్పసంపద.. అడుగడుగునా ఉట్టిపడే రాజసం.. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజరికపు రాజసానికి నిలువెత్తు నిదర్శనం రాచకొండ. గుట్టలపైన శత్రు దుర్భేద్యమైన కోట.. ముఖద్వారాలు, ఈత కొలనులు, మంచినీటి బావులు, ప్రార్థన మందిరాలు.. కనుచూపుమేర రాజ్యం..

దేవాలయాలు, నాట్యశాలలు, పురోహితులు, ప్రజల ఆవాస ప్రాంతాలు, దట్టమైన అడవి.. ఇలా ఓ పెద్ద సామ్రాజ్యపు ఆనవాళ్లు అక్కడికి వెళ్లినవారిని తట్టిలేపడం ఖాయం. 700 ఏండ్ల నాటి చారిత్రక ఆనవాళ్లు నేటికీ పద్మనాయక వంశ(వెలమల) రాజుల కీర్తి పతాకాన్ని చాటుతున్నాయి. ఇంతటి మహోన్నతమైన రాచకొండ చరిత్రను నేటితరం తనివీతీరా చూడాల్సిందే. హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలో సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ చరిత్రపై స్పెషల్ స్టోరీ.

రాచకొండ చారిత్రక నేపథ్యమిదీ..

కాకతీయుల పతనానంతరం పద్మనాయకులు రాచకొండ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. రాచకొండ గ్రామానికి సమీపంలో కోటను నిర్మించారు. క్రీ.శ. 13వ శతాబ్దంలో ప్రస్తుత తెలంగాణ ప్రాంతమంతటికీ రాచకొండను రాజధానిగా చేసుకొని రేచర్ల పద్మనాయక వంశీయులు పాలించారు. అప్పట్లో రాచకొండకు రాజాద్రి, రాజగిరి అనే పేర్లు కూడా వాడుకలో ఉండేవి. కాకతీయ రాజ్య పతనానంతరం పద్మనాయక వంశీయులు స్వతంత్రంగా రాజ్యాన్ని స్థాపించారు.

వీరి కాలంలో నిర్మించిన దుర్గాల్లో రాచకొండ, దేవరకొండ ప్రత్యేకమైనవి. రాచకొండ దుర్గాన్ని అనపోతనేడు అనే ప్రభువు నిర్మాణించాడు. ఈయన కాలంలోనే రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు తరలించి, రాచకొండను రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు. అనంతరం వారి వంశీయులందరూ రాచకొండను రాజధానిగా చేసుకునే పాలన సాగించారు. వీరిపాలనలోనే పతనమవుతున్న హైందవ సంస్కృతిని పునరుద్ధరించారు.

దేవాలయాలను నిర్మించడమే కాకుండా శిథిలమైన కళాసంపదను పునరుద్ధరించారు. కవి, పండితులను పోషించారు. సంస్కృతాంధ్ర భాషలను ఆదరించారు. ఎంతో కీర్తిని పొందారు. క్రీ.శ.1360 నుంచి క్రీ.శ.1475వ సంవత్సరం వరకు పద్మనాయకుల పాలన కొనసాగింది.

ఇక్కడ అపురూపమైన కట్టడాలున్నాయి. ఎర్ర దాచనాయుడితో ప్రారంభమైన వీరి పాలన సర్వజ్ఞరావు సింగభూపాలుడితో ముగిసింది. తర్వాత ఈ వంశీయులు విజయనగర రాజ్యంలో సామంతులుగా ఉండటంం, అనంతరం బహుమనీల రాజ్య విస్తరణతో వారి ఏలుబడిలోకి వెళ్లింది. 

అడుగడుగునా రాజరికమే..

నిజానికి రాచకొండ విస్తీర్ణం.. సుమారు 35 వేల ఎకరాలు. ప్రస్తుత యాదాద్రి జిల్లాలో ఉన్న సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలో 14,760 ఎకరాలు, చౌటుప్పల్, రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలంలో మిగతా ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ నేటికీ 4 వేలకు పైగా నెమళ్లు ఉన్నాయి. నక్షత్ర తాబేళ్లకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఇకపోతే ప్రధాన కోటకు కింద నుంచి పైకి 7 ముఖ ద్వారాలున్నాయి.

ద్వారాలన్నీ శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. అయితే ప్రస్తుతం కోట అంతా నామరూపాలు లేకుండా పోయింది. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడంతో కోట రూపురేఖల్ని కోల్పోయింది. కొండపైన ఉన్న ప్రత్యేక ప్రార్థన మందిరం మాత్రమే రాజదర్పానికి ఆనవాలుగా మిగిలింది. మరోవైపు కొండపైన రెండు ఈత కొలనులు పెద్దపెద్ద బండలను తొలిచి నిర్మించారు. లోతైన మంచినీటి బావులు ఉన్నాయి.

ఇక్కడి సంకెళ్ల బావికి ఓ ప్రత్యేకత ఉంది. పట్టుబడిన దొంగలకు సంకేళ్లు వేసి నీళ్లు తోడించేవారు. రాచకొండలో దాదాపు 300 చెరువులు, కుంటలు ఉండగా, పెద్ద చెరువుల వద్ద ప్రత్యేకంగా శాసనాలు వేయించారు. అన్నపోత, నాగసంద్రం, దేవ, రాయ చెరువులు ఇక్కడ ప్రధానమైనవి.

గొలుసుకట్టుతో ఉన్న ఈ చెరువులు చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. మరోవైపు ఎత్తయిన కొండలపై ఎంతో పటిష్ఠంగా నిర్మించిన రాచకొండ కోట చుట్టూ 40 కి.మీ. పొడవైన ఎత్తయిన రాతి గోడ, భారీ గ్రానైట్ రాళ్లతో, పలు మలుపులతో ‘ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ను తలపించేలా కనిపిస్తుంది.

శివలింగంపై సూర్య కిరణాలు పడేలా..

రాచకొండలో 150 ఆలయాలుండగా.. అందులో 100కు పైగా శివాలయాలే. సూర్య కిరణాలు శివలింగంపై పడేలా ఆలయాలను నిర్మించారు. కొండ చుట్టూ  దారి వెంట వినాయక ప్రతిమలు చెక్కించారు. చౌటుప్పల్ సమీపంలో జాతీయ రహదారిపై కొయ్యలగూడెం నుంచి రాచకొండకు వెళ్లే దారిలో కొండకింద ప్రధాన శివాలయం ఉంది. కోటకు అభిముఖంగా ఉన్న ఈ ఆలయానికి రాజులు వచ్చి పూజలు చేసేవారు. కోటకు వెళ్లే ప్రధాన ముఖద్వారం సమీపంలోనే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

పద్మవ్యూహంలా కోట లోపలి మార్గాలు..

కోట ప్రహరీ గోడ నుంచి కోట అంతఃపురానికి చేరుకోవడానికి కనీసం మూడు కిలోమీటర్ల వరకూ నడవాల్సి వుంటుంది. ఆ మూడు కిలోమీటర్ల ప్రాంతంలో ఎన్నెన్నో అద్భుత నిర్మాణాలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. అంతఃపురానికి వెళ్లేందుకు ప్రధానంగా రెండు రహదారులున్నాయి. నడిచి వెళ్లే వారికి మెట్ల మార్గం నిర్మించారు.

అలాగే రాజులు, ఆయన వెంట ఉండే పరివారం, మంత్రి వర్గం వారు గుర్రాలపై వెళ్లడానికి అనువుగా చదునుగా ఉండే మరో మార్గం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. కోటలోనికి ప్రవేశించిన కొత్తవారికి, శత్రువులకు ఏమాత్రం అర్థం కాని రీతిలో గజిబిజిగా ఆ మార్గాలను నిర్మించారు. దీంతో వెళ్లాల్సిన మార్గం తెలియక వారు తికమక పడుతున్న సమయంలో రాచకొండ సైనికులు వాళ్లపై దాడి చేసి మట్టుబెట్టేవారు.

మర ఫిరంగులతో దాడి చేయడానికి నిర్మించిన బురుజుల వంటి అనేక నిర్మాణాలు కోట చుట్టూ అనేకంగా మనకు కనిపిస్తాయి. ఈ దారులన్నీ కూడా తికమకగా, జిగ్‌జాగ్‌గా ఉండి, నాలుగు వరుసల గోడలతో ఉంటాయి. నాలుగు మలుపులు తిరిగిన తరువాత మనకు మొదటి ప్రధాన ద్వారం ఎదురవుతుంది. ఈ విధంగానే మిగతా రెండు ప్రధాన ద్వారాలు కూడా మలుపులతో ఉంటాయి. ఇలాంటి తికమక మార్గాలు కోటలో అనేకంగా మనకు కనిపిస్తాయి.

 బాదిని నర్సింహా, నల్లగొండ, విజయక్రాంతి