09-11-2025 01:29:39 AM
చిట్యాల, నవంబర్ 8(విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి 65పై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా దగ్ధమై కాలిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ కారులోని 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాదు నుంచి విజయవాడకు బయలుదేరిన ఇన్నోవా కారు తెల్లవారుజామున గుండ్రాంపల్లి వద్ద డివైడర్‌ని ఢీ కొట్టి బోల్తా పడి మంటలు చెలరేగాయి.
ఇంతలో అటుగా వస్తున్న లారీలలోని వాళ్లు ప్రమాద సంఘటనను చూసి తమ వాహనాలను పక్కన ఆపి రక్షించేందుకు యత్నించారు. లారీల డ్రైవర్లు ముగ్గురు రామకృష్ణ, అశోక్, షరీఫ్‌లు ఇన్నోవా కార్ డోర్లు తీసి అందులోని ప్రయాణికులను సురక్షితంగా వెలుపులకు తీశారు.
ఇందులో ఒకరు అయ్యప్ప మాల ధరించి ఉన్నాడు. తోటి వారి ప్రాణాలు కాపాడాలని అయ్యప్పమాలలో ఉండి వారిని కాపాడి దైవంగా నిలిచాడు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు చేతులు కాలుతున్నా లెక్కచేయకుండా 8 మంది ప్రాణాలు కాపాడడంతో ఆ ముగ్గురు రియల్ హీరోలుగా నిలిచారు. వీరిని ముందుగా చౌటు ప్పల్ హాస్పిటల్‌కు అక్కడినుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.