21 August, 2026 | 1:41 AM

బావిలోకి దూసుకెళ్లిన కారు

21-08-2026 12:00 AM
  1. నలుగురు దుర్మరణం
  2. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు
  3. సిద్దిపేట జిల్లా అప్పన్నపల్లి శివారులో ఘటన

సిద్దిపేట క్రైం, ఆగస్టు 20 (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. దుబ్బాక మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన ధన్ల రాజు (35), అతని భార్య భాగ్య( 22), కుమారుడు నియాన్స్(5), కూతురు శాన్విక(3).. సిద్దిపేటలో జరిగిన ఒక బంధువు దశ దినకర్మ కార్యక్రమానికి హాజరై అర్థరాత్రి వేళ స్వగ్రామానికి కారులో బయలుదేరారు.

అప్పన్నపల్లి గ్రామ శివారు వద్ద వేగం అదుపుతప్పి కారు బావిలో పడింది. దాంతో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. అర్ధరాత్రి కావడం, ఆ ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో ప్రమాదం జరిగిన విషయాన్ని మొదట్లో ఎవరూ గుర్తించలేకపోయారు. సమాచారం అందుకున్న దుబ్బాక సీఐ, ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని, క్రేన్ సహాయంతో మృతదేహాలను బావిలో నుంచి వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.