21 August, 2026 | 2:38 AM

నిరంతర కృషితో జాతీయ స్థాయికి

21-08-2026 12:00 AM

కల్నల్ సురేష్‌గౌడ్

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): పాలమూరు యువత సరైన ఆలోచనా విధానం, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషితో జాతీయ స్థాయికి ఎదగాలని ప్రముఖ సైనిక అధికారి కల్నల్ వి సురేష్‌గౌడ్ సూచించారు. జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఫ్రం పాలమూరు టు నేషనల్ లెవల్ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, తీసుకున్న నిర్ణయాలు, సాధించిన విజయాలను విద్యార్థులతో పంచుకున్నారు. అవకాశాల కోసం ఎదురుచూడకుండా వాటిని సృష్టించుకోవాలని, ఉద్యోగాలు పొందే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు.

సాంకేతిక పరిజ్ఞానం, స్టార్టప్లు, నూతన ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. పుస్తక పఠనం, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం విజయానికి కీలకమని పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఉన్న వివిధ అవకాశాలను వివరించి, పాలమూరు యువతలో ఉత్సాహం, పట్టుదల, దేశభక్తి మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ కె.ఎస్. రవి కుమార్ మాట్లాడుతూ.. కల్నల్ సురేష్ గౌడ్ విజయాలు పాలమూరుకు గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో ఆర్మీ ఆఫీసర్ నాజర్, ప్రిన్సిపాల్ డా. పి. కృష్ణమూర్తి, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డా. వి.ఈ. చంద్రశేఖర్, డా. కె. గురు రాఘవేంద్ర రెడ్డి, కరుణాకర్ గౌడ్, డా. రమేష్ రెడ్డి, బాలనర్సింలు, అశోక్ కులకర్ణి పాల్గొన్నారు.