నారాయణపూర్ గ్రామస్తుల వినూత్న నిరసన
- అస్వస్థతకు గురైన మహిళలు.. పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సుంకే
చొప్పదండి, ఆగస్టు 20 (విజయ క్రాంతి): గంగాధర మండల కేంద్రంలో నారాయణపూర్ గ్రామస్తులు చేపట్టిన వినూత్న నిరసనలో ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 100 మంది గ్రామస్తులు గురువారం జోలలు పట్టుకుని ర్యాలీ గా వచ్చి సామూహికంగా అడుక్కుంటూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎండలో సుదీర్ఘంగా నిరసనలో పాల్గొనడంతో నీరసించి ముగ్గురు మహిళలు ఒక్కసారిగా కిందపడినట్లు సమాచారం.
వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆసుపత్రికి చేరుకుని అస్వస్థతకు గురైన మహిళలను పరామర్శించారు. వారిని పలకరించి ధైర్యం చెప్పారు. అనంతరం వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అవసరమైతే కరీంనగర్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులతో మాట్లాడారు.






