6 July, 2026 | 3:10 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

మెడపై కత్తి పెట్టి కారు అపహరణ

27-06-2024 01:18 AM

రాజేంద్రనగర్, జూన్ 26: మెడపై కత్తి పెట్టి ఇద్దరు దుండగులు కారు అపహరించి ఉడాయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రా బాలాజీనగర్‌కు చెందిన బుడ్డు రాజ్‌కుమార్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 23న నేరెడ్‌మెట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణికులను తీసుకెళ్లాడు. అక్కడ వారిని దించేసి కారును పార్క్ చేశాడు. ఈ క్రమంలో నజీబుల్లాఖాన్, మహమ్మద్ అబ్దుల్ మాజిద్ పార్కింగ్ ప్రదేశానికివెళ్లారు. ఒకరు రాజ్‌కుమార్ మెడపై కత్తి పెట్టగా, మరోవ్యక్తి కారు తాళం ఇవ్వాలన్నాడు.

దీంతో భయపడిన రాజ్‌కుమార్ తాళం ఇచ్చేశాడు. అనంతరం నజీబుల్లాఖాన్, మహమ్మద్ అబ్దుల్ మాజిద్ కారు నడుపుకొంటూ అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుడు వెంటనే కారు యజమానికి కాల్ చేసి విషయం చెప్పాడు. అనంతరం బాధితుడు, కారు యజమాని శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. రాజ్‌కుమార్ చెప్పిన వివరాల ప్రకారం నిందితుల కోసం వేట ప్రారంభించారు. నిందితులను అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి కారుతో పాటు ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.