తూకంలో మోసాలకు పాల్పడితే కేసులు
తాలు పేరుతో తూకంలో కోత పెడితే చర్యలు
రైతుల ఫిర్యాదుతో సందర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే
నిర్వాహకుల తీరుపై లక్ష్మీకాంతారావు ఆగ్రహం
కామారెడ్డి, మే12 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో మోసాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో తాలు పేరుతో నిర్వాహకులు దోచుకుంటున్నారని రైతులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే ఆదివారం జుక్కల్ మండలం ఖండేబల్లూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఐకేపీ నిర్వాహకులు చేస్తున్న మోసాలను రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తాలు పేరుతో బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
40 కిలోల బస్తాకు 2 కిలోల తరుగు తీయడం ఏమిటని ప్రశ్నించిన రైతులను కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారని రైతులు ఎమ్మెల్యేకు వివరించారు. జుక్కల్ మండలంలోనే కాకుండా ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ జరుగుతున్న తీరును ‘విజయక్రాంతి’ దినపత్రిక ఇటీవలే వెలుగులోకి తెచ్చిన విషయం విధితమే. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో జరుగుతున్న దోపిడీపై ఆరాతీశారు. ఇకపై దోపిడీకి పాల్పడితే క్షమించబోమని నిర్వాహకులను హెచ్చరించారు.
అయినా జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను తాలు పేరుతో అదనంగా ధాన్యాన్ని దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే స్వయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతుల గోడు విన్న ఎమ్మెల్యే.. తూకంలో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేయిస్తామని నిర్వాహకులనుహెచ్చరించారు. రైతులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సెంటర్ నిర్వాహకుడిని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులను దూషించినందుకు కేసు నమోదు చేయాలని సూచించారు. తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.




