20-12-2025 05:35:02 PM
- 5181 లీటర్ల మద్యం స్వాధీనం
- రూ.30,36,620 నగదు పట్టివేత
సిద్దిపేట క్రైం: గ్రామ పంచాయతీ ఎన్నికలు సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు చేసినట్టు పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను జిల్లా వ్యాప్తంగా మొత్తం 432 కేసులు నమోదు చేశామని చెప్పారు. అందులో 271 మద్యం కేసులు ఉన్నాయని, 5 వేల ఒక వంద 81 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ. 37లక్షల 89 వేల 5వందల30 ఉంటుందని అంచనా వేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న వస్తువులు, లెక్కచూపని నగదును తనిఖీ బృందాలు పట్టుకున్నాయని తెలిపారు. 35 కేసుల్లో రూ. 2,29,560 విలువైన వస్తువులను సీజ్ చేయడంతోపాటు సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 30,36,620 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంపై 27 కేసులు , బాణ సంచా కాల్చడం పై 15 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా ఇప్పటివరకు 2,729 మందిని అధికారుల ముందు బైండోవర్ చేసినట్టు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్డు వెలువడిన నుంచి డిసెంబర్ 17 వరకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన పోలీస్ సిబ్బంది, ప్రజలకు కమిషనర్ విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.