20-12-2025 05:58:23 PM
పెద్దపల్లిలో ఫర్టిలైజర్ షాపు తనిఖీలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతరం అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శనివారం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద గల ఫెర్టిలైజర్స్ ఎరువుల షాపును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా లభ్యతపై రైతులకు ఎటువంటి అనుమానాలు, అపోహలు అవసరం లేదని, ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. యూరియా ప్రతి రైతుకు చేరాలని ఉద్దేశంతో జిల్లాలో యూరియా ట్రాకింగ్ యాప్ సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు.
గత నెల రోజుల నుండి యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు జిల్లాలో పర్యవేక్షించామని కలెక్టర్ తెలిపారు. మనం అనుసరించిన విధానాన్ని పరిశీలించిన ప్రభుత్వం మరింత మెరుగ్గా యూరియా బుకింగ్ యాప్ ప్రవేశ పెట్టిందని అన్నారు. ఓలా, ఉబర్ వంటి యాప్ లలో టాక్సీ ఎలా బుక్ చేస్తామో, అదేవిధంగా సులభంగా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రైతులు తమ ఇంటి వద్ద నుంచి యూరియా బుక్ చేసుకుని ఎరువుల షాప్ కు స్వయంగా వచ్చి లేదా ఇతరులతో తమ బుక్ చేసుకున్న బస్తాల వివరాలు, ఓటిపి చెప్తే షాప్ యజమానులు యూరియా సరఫరా చేస్తారు.
ఈ యాప్ ఉపయోగించడం వల్ల రైతుల సమయం వృధా కాదని, లైన్లలో నిలబడకుండా సరైన సమయంలో వచ్చి యూరియా తీసుకువెళ్లచ్చని, యాప్ విధానం ద్వారా రైతులు అవసరానికి మించి యూరియా తీసుకొని వెళ్లి స్టాక్ పెట్టుకోవడం నియంత్రించవచ్చని, చిన్న సన్న కారు రైతులకు ఎటువంటి యూరియా కొరత రాకుండా ఉంటుందని, రైతులు తమ వ్యవసాయ భూమి వివరాలు తమకు ఎంత యూరియా అవసరమంటుందో ఇంకా ఎన్ని కావాలో అనే అంశాలు ఈ యాప్ లో నమోదవుతాయని కలెక్టర్ తెలియజేశారు. రైతులు ఈ యాప్ ను ఉపయోగించడం సులభంగా ఉంటుందని ప్రతి ఒక్కరు యాప్ ఉపయోగించుకొని యూరియా కొనుగోలు చేయాలని ఆప్ ఉపయోగించడంలో ఏదైనా సమస్యలు ఏర్పడితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ అన్నారు.