calender_icon.png 20 December, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులకు రూ.25 వేల ఆర్థిక సహాయం

20-12-2025 05:49:44 PM

ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి,(విజయక్రాంతి): క్రీడా రంగంలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో జిల్లా పాలన మరో కీలక ముందడుగు వేసింది. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి కామారెడ్డి జిల్లాకు గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆర్థిక సహాయం అందజేశారు. జిల్లా పరిపాలన తరఫున ఒక్కో క్రీడాకారుడికి రూ.25,000 చొప్పున చెక్కులను శనివారం కలెక్టర్ తన ఛాంబర్‌లో అందజేశారు. గోతి పరశురం, కిన్నెరా ఆనంద్, మలవాత్ ఈశ్వర్ అనే ముగ్గురు అథ్లెటిక్స్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించి జిల్లాకు విశేష గుర్తింపును తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ వారిని ఘనంగా సత్కరించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ కష్టపడి సాధించిన ఈ విజయాలు జిల్లాలోని యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

జిల్లాకు తీసుకొచ్చిన గౌరవం అపూర్వం

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ... “జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించి కామారెడ్డి జిల్లాకు మీరు తీసుకొచ్చిన గౌరవం ప్రశంసనీయమైనది. మీ విజయాలు జిల్లాలోని యువతకు ప్రేరణ. ఇదే ఉత్సాహం, పట్టుదల, కృషితో ముందుకు సాగి జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా విజేతలుగా నిలవాలి” అని ఆకాంక్షించారు. క్రీడల్లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, నిరంతర సాధన, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని కలెక్టర్ తెలిపారు.

ప్రతిభావంతులైన క్రీడాకారులకు నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటుందని, వారి విజయాలను గుర్తించి ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. క్రీడా రంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి జిల్లాలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు జిల్లా యువజన, క్రీడాశాఖ ద్వారా అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. క్రీడా మైదానాల అభివృద్ధి, శిక్షణా సదుపాయాలు, కోచింగ్, క్రీడా సామగ్రి అందుబాటులో ఉండేలా జిల్లా పాలన నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. 

భవిష్యత్తులో జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలు అందించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. క్రీడల ద్వారా యువతను ఆరోగ్యవంతంగా, క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లడమే జిల్లా పాలన లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాశాఖ అధికారి రంగ వేంకటేశ్వర గౌడ్, అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, సెక్రటరీ అనిల్, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.