29-07-2025 01:11:53 AM
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాం తి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ కాద ని.. ఆ గణన కేవలం గణాంకాల సేకరణ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వివరాలను రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు.. మండలాల స్థాయిలో కులగణన చేయలేదని అనేకమంది టీచర్లు చెబుతున్నారని..కులగణనను అధికారికంగా చేయాలంటే, అది రాజ్యాంగబద్ధమైన సంస్థలతో, సరైన డేటా ద్వారా చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ కులగణనకు వ్యతిరేకం కాదని..కానీ శాస్త్రీయంగా, రాజ్యాంగబద్ధంగా జరగాలని స్పష్టం చేశారు.
మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా గణనలో కులగణనను అధికారికంగా తీసుకురాబోతున్నదన్నారు. అధికారికంగా జనగణనలో భాగంగా కులగణనను చేర్చడం వల్ల దేశంలోని వివిధ సామాజికవర్గాల గణాంకాలు స్పష్టంగా వెలుగులోకి వస్తాయన్నారు.
బీజేపీ ఓబీసీల సంక్షేమంపై పూర్తి నిబద్ధతతో ముందుకెళ్తోందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఓబీసీలు బీజేపీతోనే ఉన్నారని పేర్కొన్నారు. రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకే పెద్దపీట వేస్తామని తెలిపారు.
మతపరమైన రిజర్వేషన్లతో అన్యాయం..
గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 50 డివిజన్లు కేటాయించామని అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని..కానీ వాటిలో సుమారు 35 డివిజన్లలో బీసీల స్థానంలో ముస్లింలే గెలిచారని రాంచందర్‌రావు అన్నారు. ఈ పరిణామంతో యాదవ, గౌడ్, గంగపుత్ర వంటి బీసీ సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదన్నారు. ప్రస్తుతం ముస్లింలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 4శాతం రిజర్వేషన్ అమలవుతోందని..
అయితే ఈ రిజర్వేషన్‌లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారమే చెల్లుబాటు కావాలన్నారు. రేవంత్‌రెడ్డి తాజా కుల గణాంకాలతో బీసీల జనాభా 56.4% అని ప్రకటించారని..కానీ బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడమే లేదన్నారు. ఈ అసమానతలను నిలదీయాల్సిన అవసరం ఉందని..బీసీల గొంతుకను నొక్కిపెట్టే ప్రయత్నాలను బీజేపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.