05-07-2025 08:56:20 PM
బీసీ విద్యార్థి సంఘం సమాఖ్య రాష్ట్ర నాయకులు వావిళ్ళ రమేష్ గౌడ్..
చివ్వేంల: సూర్యాపేట- చివ్వేంల ప్రధాన రహదారి (బీబీ గూడెం)కి అనుకోని నూతనంగా ఏర్పాటు చేసిన 'శ్రీ చైతన్య' పాఠశాలకు ప్రభుత్వం నుంచి సీబీఎస్ఈ బోర్డు అనుమతి లేకపోయినా.. పాఠశాల యాజమాన్యం నిర్భంధంగా విద్యార్ధులకు బోధన తరగతులు నిర్వహిస్తున్నట్లు ఈ విషయమై జిల్లా విద్యాధికారి అశోక్(District Education Officer Ashok)కు సమాచారం ఇచ్చిన పట్టించుకోకపోవడం హేయమైన చర్యని బీసీ విద్యార్థి సంఘం(BC Student Union) సమైక్య రాష్ట్ర నాయకులు వావిళ్ళ రమేష్ గౌడ్ అన్నారు. శనివారం సంబంధిత పాఠశాల పేరుతో ముద్రించిన సీబీఎస్ఈ పుస్తకాలు తల్లిదండ్రులతో కలసి ఓ రహస్య గదిలో ఉన్న సుమారు రూ. 30 లక్షల విలువ జేసే పుస్తకాలు, మరో రూ. 20 లక్షల విలువజేసే యూనిఫారం పట్టుకున్నారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ పాఠశాలకు సీబీఎస్ఈ బోధనకు గుర్తింపు ఉందని తప్పుడు ప్రచారం చేస్తూ.. తల్లిదండ్రుల్ని నమ్మించి వేలాది రూపాయలను యాజమాన్యం అక్రమ వసూలు చేస్తోందన్నారు. అంతేకాకుండా సీబీఎస్ఈ పర్మిషన్ లేకున్నా స్థానిక జిల్లా విద్యాధికారి అశోక్ కనుసైగల్లో రహస్య ఒప్పందం కుదుర్చుకొని సీబీఎస్ఈ బోధన చేస్తున్నారని ఓ ఇంట్లో పుస్తకాలు అమ్ముతున్నారని విషయం తెలుసుకొని తల్లిదండ్రులు, బీసీ విద్యార్థి సంఘం, ఎల్ఎచ్ పీఎస్ సంయుక్తంగా చేపట్టిన సమిష్టి కృషి వల్ల శ్రీ చైతన్య పాఠశాల దోపిడీ బాగోతం బట్టబయలు అయిందన్నారు. శ్రీ చైతన్య పేరు.. సీబీఎస్ఈ ముద్రించి ఉన్న పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు గదుల్లో కిక్కిరిసి ఉండటం చూసి ఉన్నతాధికారులైన జిల్లా విద్యాధికారికి ఫోన్ చేసినా.. మెసేజ్ చేసిన పట్టించుకోలేదని.. సంబందిత సిబ్బంది నుంచి ఇన్ఫర్మేషన్ అందించిన ఈరోజు ఆప్షనల్ హాలిడే కావున మేము అందుబాటులో లేమని.. వదిలేయండి.. అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం సిగ్గుచేటన్నారు.
ఇప్పటికయినా జిల్లా కలెక్టర్ స్పందించి అనుమతి లేని పాఠశాలు, అడ్మిషన్, బుక్స్, యూనిఫామ్ పేర్లతో నిలువు దోపిడీ చేస్తున్న శ్రీ చైతన్యతో పాటు పలు పాఠశాలలపై, అలాగే దోపిడికి పరోక్షంగా సహకరిస్తున్న జిల్లా విద్యాధికారి అశోక్ పై చట్టపర చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లి దండ్రులు, సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భూక్యా రాజు నాయక్, బీసీ సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు పోలోజు మహేష్ చారి తదితరులు ఉన్నారు.