06-07-2025 12:17:28 AM
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): మాజీ మంత్రి కేటీఆర్ గుర్తింపు సమస్యతో బాధపడుతున్నారని, విదేశాల్లో ఉన్న తాను తెలంగాణకు వచ్చినట్టు చెప్పేందుకే ప్రెస్‌మీట్ పెట్టినట్టుగా ఉందని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. శనివారం ప్రజాభవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్‌కు అర్థం కానట్టు ఉందన్నారు.
ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చర్చిద్దాం రండి అని సవాల్ చేస్తే ప్రెస్‌క్లబ్‌కు రమ్మనడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది ప్రెస్‌క్లబ్‌లో చర్చించేందుకు కాదని చురకలు అంటించారు.
72 గంటల డెడ్‌లైన్ అంటూ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని, డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సొంత చెల్లెలే తనను నాయకుడిగా గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి ఎందుకు రారు అని, సమస్యలపై చర్చిద్దాం అంటే భయమెందుకు అని ప్రశ్నించారు.