calender_icon.png 6 July, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐడీఓసీలోని కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ

05-07-2025 08:56:26 PM

50 మందికి షోకాజు నోటీసులు జారీ

కలెక్టర్ రాకతో ఉలిక్కి పడ్డ అధికారులు, ఉద్యోగులు

మంచిర్యాల: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐడీఓసీలోని అన్ని శాఖల జిల్లా అధికారుల కార్యాలయాలను శని వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల రిజిస్టర్లు, రికార్డులు, అధికారుల, ఉద్యోగుల, సిబ్బంది హాజరు పట్టికలు, ఆయా కార్యాలయాల పరిధిలో కొనసాగుతున్న పనుల వివరాలను పరిశీలించారు. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో అధికారులు, ఉద్యోగులు ఉలిక్కి పడ్డారు.

50 మందికి షోకాజు నోటీసులు జారీ...

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, సమయపాలన పాటించని 50 మంది అధికారులకు, ఉద్యోగులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక జిల్లా ఏర్పడిన నాటి నుంచి కలెక్టర్ ప్రభుత్వ కార్యాలయాలను తిరిగి పరిశీలించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వివిధ శాఖల అధికారులకు ఇంత పెద్ద మొత్తంలో నోటీసులు ఇవ్వడం ఇదే మొదటి సారి కావడం విశేషం. కలెక్టరేట్ లోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో పది మందికి, పంచాయతీ రాజ్ శాఖలో ఐదుగురికి, పౌర సరఫరాల సంస్థలో ఐదుగురికి, జిల్లా గ్రామీణాభివృద్ది శాఖలో ముగ్గురికి, బీసీ వెల్ఫేర్ లో ముగ్గురికి, ఎస్ సీ డెవలప్ మెంట్ శాఖలో ముగ్గురికి, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ఇద్దరికి, ఏడీ మైనింగ్ కార్యాలయంలో ఇద్దరికి, ఎస్సీ కార్పొరేషన్ లో ఇద్దరికి, ఆర్ అండ్ బి కార్యాలయంలో ఇద్దరికి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో ఇద్దరికి, వ్యవసాయ శాఖలో ఇద్దరికి, ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఇద్దరికి, జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఇద్దరికి, హార్టికల్చర్ కార్యాలయంలో ఒకరికి, తెలంగాణ వైద్య విద్యన్ పరిషత్, గ్రౌండ్ వాటర్, మైనారిటీ వెల్ఫేర్, ఆడిట్ సెక్షన్, జిఎం ఇండస్ట్రీస్ కార్యాలయాల్లో ఒక్కొక్కరికి షోకాజు నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ తనిఖీ సమయంలో కొన్ని శాఖల కార్యాలయాలకు తాళం కూడా తీయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం  చేశారు.

విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: కలెక్టర్ కుమార్ దీపక్

ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శని వారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు పని చేయాలని, ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు ప్రజలకు చేరువలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.