calender_icon.png 6 July, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నరు..

06-07-2025 12:20:06 AM

  1. 600 రోజులు దాటిపోయినా పత్తాలేదు
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
  3. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ  

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇచ్చిన 6 గ్యారెంటీలను నమ్మి ప్రజలు మీ పార్టీకి పట్టం కట్టారని... 100 రోజుల్లో గ్యారెంటీలు, హామీలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి 600 రోజులైనా ఆ హామీలు అమలు కావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు పేర్కొన్నారు.

ఈ మేరకు శనివా రం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 6 గ్యారెంటీలలో 63 అనుబంధ హామీలను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సంతకాలతో ఊరూరా పంచారని, సోని యా, రాహుల్ గాంధీ సంతకాలతో అన్ని వార్తా పత్రికల్లో మొదటి పేజీల్లో ప్రకటనలు కూడా ఇచ్చారని, కానీ ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు చేయక కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

మహాలక్ష్మి పేరు మీద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేరలేదన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకంలో తులం బంగారం ఇస్తామన్నా నేటికీ అమలు కాలేదన్నారు. కాలేజీ వెళ్లే ప్రతి అమ్మాయికి స్కూటీ, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, చేయూత కింద రూ.4,000 నెలవారీ పింఛను, వృద్ధులు, వితంతువులకు రూ.4,000 ఫించన్లలో ఏ ఒక్కటీ అందలేదన్నారు.

మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.15,000 చొప్పున, రైతు కూలీలకు ఏడాదికి రూ. 12,000 ఇస్తామన్న హామీ కూడా నీటి మీది రాతగానే మారిందన్నారు. ఎకరానికి రూ .6,000 చొప్పున కొంత మంది రైతుల ఖాతాలకే బదిలీ చేశారని.. ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.15,000 చొప్పున రైతులందరికీ  రైతు భరోసా డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. 

40 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం చెప్పి కేవలం 20 లక్షల మందికే రుణమాఫీ చేశారని, మిగతా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు ఏ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వలేదని, రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించలేదన్నారు. పీఎంఏవై కింద కేంద్రం సహకరిస్తున్నా, ఇల్లు లేని పేదలను ఆదుకోవడంలో కాంగ్రెస్  ప్రభు త్వం చిత్తశుద్దితో పనిచేయడం లేదన్నారు.

అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. ఇప్పటివరకు 60 వేల నియామకాలు పూర్తి చేశామని చెప్పారని, ఇందులో గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లకే నియామక పత్రాలు ఇచ్చినవే ఎక్కువని అన్నారు. తక్షణమే 2 లక్షల నియామకాల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులకు  రూ.5 లక్షల విద్యా భరోసా కార్డును కూడా వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు ఇవ్వడం, పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించ డం లేదని... ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పాక్షికంగానే అమలవుతోందన్నారు. 6 గ్యారెంటీలు, 63 అను బంధ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.