06-07-2025 12:15:16 AM
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ఎమ్మెల్యే చర్చ చేయాల్సింది అసెంబ్లీలో అయితే ప్రెస్‌క్లబ్‌లో చర్చ చేద్దామని సవాల్ చేయడం వింతగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై శనివారం మంత్రి పొన్నం స్పందిస్తూ బనకచర్ల, రాష్ట్రం లో అమలు చేస్తున్న పథకాలపై బాధ్యత గత ప్రతిపక్ష నాయకుడు స్పీకర్‌కు లేఖ రాస్తే శాసనసభ వేదికగా చర్చకు సిద్ధమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని గుర్తు చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్ దేశంలో లేకపోవడం వల్ల సమాచారం తెలియలేదేమోనని ఎద్దేవా చేశారు. ప్రెస్‌క్లబ్ వాళ్లు పిలిస్తే చర్చించేందుకు కచ్చితంగా వస్తామని తెలిపారు. ప్రభుత్వ విధానాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌తో లేఖ రాయించండి.. ప్రెస్‌క్లబ్‌లో కాదు, తెలంగాణ ప్రజలు లైవ్ చూసేటప్పుడు అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసిరారు.
బేషజాలు లేవు, బేసిన్‌లు లేవు అన్న వారితో ఏం మాట్లాడుతామన్నారు. మాజీ మంత్రివి, ఎమ్మెల్యేవి ఎక్కడ చర్చ చేయాలో తెలియదా అని ప్రశ్నించారు. తాము చర్చకు వెనుకకు పోయే వాళ్లం కాదని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా తెలంగాణకు నష్టం జరిగేలా నిర్ణయాలు తీసు కుంది మీరు అని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి నిర్ణయాలు ఓపెన్ సీక్రెట్ అన్నారు, రెడ్ కార్పెట్ వేసి నీళ్లు తీసుకుపోయింది మీరే కదా అని ప్రశ్నించారు.
తెలంగాణకు అన్యాయం జరిగిందే మీ హయాం లో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత రైతుల హక్కులు కాపాడే బాధ్యత మాది అని స్పష్టం చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎవరితో కాంప్రమైజ్ కాబోమని వెల్లడించారు. భవిష్యత్ తరాలకు తెలిసేలా అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చిద్దాం రండి అని సవాల్ చేశారు.