25-06-2025 12:00:00 AM
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకరించడంతో 12 రోజులుగా సాగుతున్న యుద్ధం ప్రస్తుతానికి పరిసమాప్తమైంది. పశ్చిమాసియాలో రాజుకున్న మంటలు ప్రపంచ దేశాలను ఆర్థికంగా దెబ్బ తీయడంతోపాటు మూడో ప్రపంచ యుద్ధంగా రూపు దాల్చవచ్చునన్న భయాలు వీడాయి. ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్’ పేరిట అమెరికా తన బాంబర్లతో ఇరాన్ అణుకేంద్రాలపై దాడికి దిగడంతో ఇక ఈ యుద్ధం ఆగేది కాదనే భావన కలిగింది.
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పక్కనే వున్న ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణులు ప్రయోగించడంతో యుద్ధం విస్తరించిందని ప్రపంచ దేశాలు ఆందోళనకు గురయ్యాయి. ఖమేనీ శాంతిని కాదంటే ఇరాన్ అణుకేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని గత ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. అయినా ఇరాన్, ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై దాడి చేసింది.
ఖతార్ పాలకుల మధ్యవర్తిత్వంతో ఇరాన్‌ను కాల్పుల విరమణకు ఒప్పించినట్లు ట్రంప్ ప్రకటించారు. యుద్ధం ప్రారంభమయినప్పటి నుంచి ట్రంప్ అనేకసార్లు ఆశ్చర్యకరమైన ప్రకటనలు చేస్తూవచ్చారు. రెండు వారాల్లో అమెరికా యుద్ధ క్షేత్రంలో దిగుతుందని ప్రకటించిన ట్రంప్, ఆ తర్వాత రెండు రోజుల్లోనే బంకర్ బాంబర్లతో ఇరాన్‌లోని మూడు కీలక అణుకేంద్రాలపై దాడులకు ఆదేశాలిచ్చారు.
ఏదేమైనా, రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించి ట్రంప్, ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. కాల్పుల విరమణ మొదలయ్యే కొద్ది నిమిషాల ముందు ఇరాన్, ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించి, ఈ యుద్ధంలో పైచేయి మనదేననే భావన దేశ ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నించింది. నిజానికి, కాల్పుల విరమణతో విజయం సాధించింది తామేనని ఎవరికి వారుగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ప్రకటించుకుంటున్నాయి.
అమెరికా కాళ్లావేళ్లా పడినందునే కాల్పుల విరమణకు అంగీకరించామని ఇరాన్ చెపుతున్నది. యుద్ధంలోకి అమెరికాను లాగగలిగిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఇరాన్‌లో ఇప్పటి కయ్యం లాభించనుంది. దేశంలో వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలను తను సులువుగా ఎదుర్కోవచ్చు. ఇజ్రాయెల్ దాడితో చేసేది లేక ప్రతిదాడులకు దిగిన ఇరాన్‌కు ఈ యుద్ధం సంకట స్థితినే తెచ్చిపెట్టింది.
ప్రతిదాడులకు ఆదేశాలిచ్చిన ఆయతుల్లా ఖమేనీకి ఈ యుద్ధం గెలువడం అంత సులభం కాదని తెలిసి వుండవచ్చు. శక్తివంతమైన రెండు దేశాలు ఇజ్రాయెల్, అమెరికాలతో యుద్ధం కొనసాగించడం ఇరాన్‌కు అంత శ్రేయస్కరమూ కాదు. మిత్ర దేశమైన ఖతార్ మాట విని ఇరాన్, యుద్ధం ముగింపుకు దారి వెతుక్కున్నదనే భావించాలి. ఖతార్ గగనతలంపైకి ఇరాన్ తన క్షిపణులను ప్రయోగించినప్పుడు, కొన్ని గంటల ముందే హెచ్చరికలు చేయడం ఇక్కడ ఆసక్తికర అంశం.
బల నిరూపణ తప్ప, విధ్వంసాన్ని కోరడం లేదని టెహ్రాన్, ఖతార్‌కు ఇలా స్పష్టం చేసినట్లయింది. ప్రాణాపాయం జరుగకుండా కూడా జాగ్రత్త పడింది. ఇరాన్‌లో ఆయతుల్లా పాలనకు చరమగీతం పాడితేగాని పశ్చిమాసియాలో శాంతి నెలకొనదని అమెరికా, దాని మిత్రపక్షాల నుంచి వస్తున్న హెచ్చరికలు కూడా టెహ్రాన్ మెత్తపడటానికి కారణమై ఉండవచ్చు.
ఇజ్రాయెల్, ఇరాన్‌లు ప్రస్తుతానికి కాల్పుల విరమణకు అంగీకరించినా ఆ దేశాలు తిరిగి కయ్యానికి కాలు దువ్వకుండా ఉంటాయా? అసలు ఈ కాల్పుల విరమణకు ఆ రెండు దేశాలు కట్టుబడి ఉంటాయా అనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే, కాల్పుల విరమణ మొదలైన తర్వాత కూడా ఇజ్రాయెల్‌లో సైరన్ల మోత ఆగలేదు.