29-01-2026 11:05:08 PM
బిచ్కుంద మున్సిపల్ లో అందరి చూపు చైర్మన్ పీఠం వైపు
ఏ వర్గానికి దక్కనుందో చైర్మన్ స్థానం..?
ఓటర్లకు అంతు చిక్కని రాజకీయం
బల ప్రదర్శనలు చేయనున్న రాజకీయ పార్టీలు
మలుపులు తిరుగుతున్న మున్సిపల్ రాజకీయం
ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కసరత్తు
కామారెడ్డి, జనవరి 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఇటీవల నూతనంగా ఏర్పడిన బిచ్కుంద మున్సిపాలిటీ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీ పీఠం ఎవరిని వరిస్తుందోనన్న చర్చ వేడివేడిగా జరుగుతున్నది. బీసీ జనరల్‌కు రిజర్వేషన్ కావడంతో మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులతో హోరాహోరీగా తలపడనున్నాయి. రిజర్వేషన్ వివరాలు ప్రకటించడంతో ఆశావా హుల్లో ఉత్కంఠత నెలకొంది.
పార్టీపరంగా జరిగే మున్సిపల్ వార్డు ఎన్నికలలో అధికార పార్టీ కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ,బిఆర్‌ఎస్ పార్టీల తరఫున అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీసీ జనరల్ కు రిజర్వేషన్ కావడంతో కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలలోని బీసీ జనరల్ అభ్యర్థులు చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నారు. మరోవైపు గెలుపు గుర్రాల కోసం పార్టీలు కసరత్తు చేస్తుండగా ఆశవాహూలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. నామినేషన్ వేసేందుకు మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఇప్పటికి రెండు రోజులు పూర్తి కావడంతో కేవలం ఒకేరోజు మాత్రం మిగిలింది. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేసే అవకాశాలు ఉన్నాయి.
బిచ్కుందలో12,759 ఓటర్లు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో మొత్తం 12,759 ఓట్లర్లు ఉన్నారు. వీరిలో 6,201 పురుషులు, 6,556 మహిళలు, 2 ఇతరులు ఉన్నారు. చైర్మన్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి,బిఆర్‌ఎస్ పార్టీలో కూడా చైర్మన్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. చైర్మన్ పీఠం దక్కించుకునేది ఎవరో వేచి చూడాల్సిందే.
ఎమ్మెల్యే తో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కసరత్తు
బిచ్కుంద మున్సిపల్ స్థానాన్ని తమ పార్టీ కవసం చేసుకోవాలని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చూడల లక్ష్మి కాంతారావు ఒకవైపు పావని కలుపుతుండగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని బి ఆర్ ఎస్ కైవసం చేసుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బిజెపికి చెందిన మాజీ ఎమ్మెల్యే అరుణతార సైతం బిచ్కుంద మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగురవేయాలని ఆలోచనతో ఉన్నారు. ఆ వైపుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ చేస్తున్నారు. మూడు పార్టీల చెందిన నాయకులు బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అడుగులు వేస్తున్నారు.
కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు
మున్సిపాలిటీని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పురపాలికలోని మొత్తం12 వార్డులను గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. నియోజకవర్గంలో వివాదరహితుడిగా జనం మెప్పు పొందిన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు నేతృత్వంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ బిచ్కుంద కావడంతో కాంగ్రెస్ చైర్మన్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటు న్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇటీవల కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
మాజీ ఎమ్మెల్యేకు అనుకూలించేనా...?
బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. అయితే, శాసనసభ ఎన్నికల్లో పరాజయం తర్వాత మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు, కార్యకర్తలకు రైతుల సమస్యలకు అందుబాటులో ఉండటం ఈ ఎన్నికల్లో అనుకూ లంగా మారే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు తోడ్పడుతాయని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
పావులు కదుపుతున్న బిజెపి
మున్సిపాలిటీలో పాగా వెయ్యాలని చూస్తుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని బిజెపి ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను బలంగా ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందాలని బిజెపి అభ్యర్థులు భావిస్తున్నారు.
నేటితో ముగియనున్న నామినేషన్‌లు
అన్ని ప్రధాన పార్టీలలో ఒక్కొక్క వార్డులో ప్రధాన పార్టీ అభ్యర్థులు పార్టీలోని అసమ్మతి నేతలు కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎవరికి పార్టీ బీ ఫామ్ లు ఇస్తదో అని అభ్యర్థులలో టెన్షన్ మొదలైంది. అసమ్మది నేతలను బుజ్జగించే ప్రయత్నంలో నాయకులు నిమగ్నమయ్యారు. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు ఆశావాహులు హైరానా పడుతున్నారు.