25-06-2025 12:00:00 AM
పాలకుర్తి రామమూర్తి :
నియుక్తః కర్మసు
వ్యయవిశుద్ధముదయం
దర్శయేత్!
కౌటిలీయం: (5.-5)
“ఆయా కర్మలలో నియుక్తుడైన అధికారి ఆదాయంలో ఖర్చులు పోను లాభం చూపించాలి” అంటాడు ఆచార్య చాణక్య. వ్యాపారంలో ఉత్పత్తుల అమ్మకాలవల్ల సంస్థకు ఆదాయం లభిస్తుంది. దీనినే నగ దు లభ్యతగా చెప్పుకుంటాం. నికర నగదు లభ్యత సంస్థకు వెన్నెముక వంటిది. ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులు, అవస రమైన శిక్షణ నివ్వడం, ముడి సరుకుల కొనుగోళ్లు, యంత్రాల నిర్వహణ, సాంకేతిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, అదనపు ఖర్చులు, మార్కెటింగ్ వ్యయా లు, ప్రభుత్వ పన్నులు, అమ్మకందారుకు ఇచ్చే కమీషన్..
వీటన్నింటినీ కలిపి ఉత్పత్తి వ్యయంగా చెప్పుకుంటాం. వచ్చిన ఆదాయంలో ఇవన్నీ పోగా మిగిలిన సొమ్మును లాభంగా పరిగణిస్తారు. వ్యాపారంలో నికరలాభం ప్రముఖమైంది. చాలామంది త మ అమ్మకం అంతా ఆదాయంగానే భా విస్తారు. అందులోంచే తమ దైనందిన ఖర్చు లు చేస్తుంటారు. కాని, ఆచార్య చాణక్య “ఆదాయం వేరు, ఖర్చులు వేరు. ఖర్చులు పోగా మిగిలిందే లాభం” అంటున్నాడు.
ప్రాచీన భారతదేశంలో రాజు సర్వాధికారి అయినా తానూ తన దైనందిన అవ సరాలకు కోశాన్ని వాడుకోకుండా కొంత మొత్తం సొమ్మును వేతనంగా తీసుకునేవాడు. వ్యాపారవేత్త కూడా సంస్థ ఆదా యాన్ని వాడుకోకుండా ఉద్యోగులకు వలె నే తానూ వేతనాన్ని తీసుకొని, తన ఖర్చు లు నిర్వహించుకోవాలి.
వ్యాపార సమగ్ర త అన్నది దాని విస్తరణ, లాభార్జనలపై ఆధారపడి ఉంటుంది. అమ్మకాలు ఎక్కువగా జరిగితే అది విస్తరణగా చెప్పుకోవాలి. అలాగని ఎక్కువ అమ్మకాలు జరిగినంత మాత్రాన అది లాభదాయకం కాకపోవ చ్చు. అలాగే, లాభాలు ఎక్కువగా వస్తే అది విస్తరణ అనుకోలేం. రెంటి మధ్య భేదాన్ని గుర్తించాలి.
వ్యాపార విస్తరణ అంటే?
ఒక వ్యాపారం విజయవంతమయ్యాక అదే ప్రక్రియను లేదా సూత్రాన్ని అనుసరిస్తూ వ్యాపార శాఖలను ఫ్రాంచైజ్‌ల ద్వారా లేదా రిటైల్ షోరూముల ద్వారా (చిల్లర అంగడుల) పలు ప్రాంతాలలో విస్తరించడం.. వ్యాపార విస్తరణగా చెప్పుకుం టాం. దానివల్ల ప్రామాణికమైన, నిరూపితమైన ప్రక్రియ ద్వారా ఉత్పతులు లేదా సేవలు నిరంతరాయంగా, స్థిరంగా వినియోగదారునికి అందుతాయి.
అలాగే సం స్థ విలువలతో కూడిన బ్రాండ్ ఇమేజ్ లేదా ప్రభావశీలత విపణివీధిలో విస్తరిస్తుంది. నిరూపితమైన వ్యాపార ప్రక్రియల వల్ల సంస్థకు నష్టాల ప్రమాదం కనీస స్థాయిలో ఉంటుంది. పెద్ద మొత్తంలో ముడిసరకుల సేకరణ కారణంగా సరఫరాదారుతో బేరమాడి తక్కువ ధరకు కొనుగో లు చేసే అవకాశం ఉంటుంది. దాంతో ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. నగదు లభ్యతతో సాంకేతికతను సమకూర్చుకుంటే వస్తు నాణ్యతా ప్రమాణాలు మెరుగు పడతాయి.
ప్రయోగంగా ఒకచోట నిరూపి తమైన వ్యాపార ప్రతిరూపం ఆయా ప్రదేశాల అవసరాలను అనుసరించి చిన్నచిన్న మార్పులతో పరివ్యాప్తమై వివిధ ప్రాంతాలలో నిలదొక్కుకోవడం సులువవుతుంది. అయితే, ఉత్పత్తులను అన్ని శాఖలకు నిరంతరం సరఫరా చేయడం, అవసరమైన విక్రయానంతర సేవలను సమయానికి అందించడం సంస్థ నిర్వహణలో పెనుసవాలుగా నిలుస్తుంది.
అంతేకాక ఏ విస్తరణ అయినా నాణ్య తా ప్రమాణాలకు లోబడి జరగక పోతే మూల వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. విస్తరణ ప్రక్రియలో నిరంతర సాంకేతిక మార్పులను ఆహ్వానించడం, అమలు చేయడం, ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షించడం, సరైన సమ యంలో, సరైన నాణ్యతా ప్రమాణాలతో, సరైన ధరలో, సరైన ఉత్పత్తులను ప్రభావవంతంగా సరఫరా చేయడం..
ఈ రకంగా కొనుగోలుదారుని విశ్వాసాన్ని నిలుపుకోవడం, ప్రతిభావంతమైన సంస్థ నిర్వహణ లో ముఖ్యభూమికగా నిలుస్తుంది. అలాగే, అవసరమైన సమర్థవంతమైన ఈ కామ ర్స్ లాంటి నెట్‌వర్కింగ్ ప్రక్రియను ఆదరించడం, అనుక్షణం అన్ని శాఖల కార్యక్ర మాలను పర్యవేక్షించడం కూడా అ త్యంత అవసరం. అలా నిర్వహించుకోగలిగిన సం స్థకు విస్తరణ ఉపయుక్తమవుతుంది.
అధిక పెట్టుబడులకు అవకాశం
నిర్దేశిత కాలానికి జరిగిన అమ్మకాలు, ధృవీకృతమైన కొనుగోలుదారుల ఆర్డర్లను ఆదాయ నివేదిక పత్రం (వ్యాపార పరిభాషలో ‘టాప్ లైన్’ అంటారు)లో పొందు పరుస్తారు. ఇది సంస్థ అభివృద్ధి సూచికగా గుర్తింపును పొందుతుంది. పో టీ సంస్థల తులనాత్మక పత్రంగానూ ఇది నిలుస్తుంది. పెట్టుబడిదారుడు నిర్ణయాన్ని తీసుకునేందుకు, అతనిని ఆకర్షించే నిర్వహణా పత్రంగానూ ఉపయోగపడుతుంది.
ఆదాయం పెరగడాన్ని లాభాలు పెరగడం గా చెప్పుకోలేం. ఆదాయంలో అన్ని విధాలైన ఖర్చులు పోను మిగులును లాభంగా చెప్పుకుంటాం. అదే వ్యాపార పరిభాషలో ‘బాటమ్ లైన్’. ఉత్పత్తి వ్యయం, అమ్మకం ధరల మధ్య అంతరం తక్కువగా ఉంటే లాభాలు తక్కువగా ఉంటాయి. లాభాలు పెంచుకునేందుకు ప్రభావవంతమైన ప్రక్రియను అనుసరించాలి.
క్రమబద్ధీకృతమైన ప్రక్రియల అమలు, వ్యయ నియంత్రణ, వనరుల కెటాయింపు లు, వాటిని ప్రతిభావంతంగా ఉపయోగించుకోవడం వల్ల సంస్థ లాభాలను ఆర్జించ గలుతుంది. అలాగే కీలకమైన ఉత్పత్తులను ఎక్కువ లాభాలకు అమ్మడం వల్ల కూడా లాభాల శాతం పెంచుకోవచ్చు. అయితే, పౌరులకు అవి నిత్యావసర ఉత్పత్తులైన సమయంలో ఆ ప్రక్రియ అనైతిక చర్యగా అవుతుంది.
వినియోగదారుని అవసరాలను గుర్తించి, ఆలస్యం లేకుండా సమయానికి అతని చేరువలో ఉత్పత్తులను/ సేవలను అందించడం వల్ల వ్యాపా రాన్ని లాభదాయకంగా మార్చుకోవడం సాధ్యపడుతుంది. ఎక్కువ శాఖలను నిర్వహించుకునే సమయంలో సమస్యలు అధి కంగానే ఎదుర్కోవలసి రావచ్చు.
ఏమరుపాటు నష్టాలవైపు నడిపించే అవకాశం ఉంటుంది. లాభాలపై మాత్రమే దృష్టిపెడితే విస్తరణ సాధ్యపడదు. ఒక సంస్థ ప్రభావశీలత ఆ సంస్థ విస్తరణ, లాభాల స్వీకరణలపై ఆధారపడి ఉంటుంది. నిజానికి రెండూ, రెండు ప్రయోజనాలకు పరిమితమయ్యేవే అయినా సంస్థ ఉనికికి రెండూ అవసరమైనవే.
వాటాదారులు వారికి వచ్చే డివిడెండ్ కోసం ఆలోచిస్తారు. డివిడెండ్ అధికంగా వచ్చే సంస్థలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరుస్తారు. పెట్టుబడులు వస్తేనే విస్తరణ సాధ్యపడుతుంది. విస్తరణవల్ల లా భాలు అందుకుంటాం. అందుకే, వ్యూహాత్మకంగా నడిచే రెండు ప్రక్రియలు పరస్పర ఆధారితాలుగా జాతి అవసరాలను ఉన్నతీకరించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి.