18-09-2025 12:07:04 PM
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, కర్నాటకలో జరిగిన ఉదంతాలను ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ(Rahul gandhi) వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరులను రక్షించడం మానుకోవాలని సీఈసీని రాహుల్ హెచ్చరించారు. ఓట్ల చోరులను రక్షిస్తోంది సీఈసీ జ్ఞానేశ్ కుమారేనని(CEC Gyanesh Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఆరోపణలు నిజం కాదని నిరూపించాలంటూ ఈసీకి రాహుల్ సవాల్ చేశారు. తాను చేసే ఆరోపణలపై 100 శాతం ఆధారాలున్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
మహారాష్ట్రలోని రజూరా అసెంబ్లీలో(Rajura Assembly constituency) నకిలీ ఓట్లను సృష్టించారని ఆరోపించారు. రజూరాలో 6,850 నకిలీ ఓట్లను జాబితాలో చేర్చారని సూచించారు. ఓట్ల చోరీ పరిశ్రమ నిర్వాహకులు ఎవరో తేలాల్సి ఉందన్నారు. ఉన్న ఓట్ల తొలగింపు.. నకిలీ ఓట్ల సృష్టి .. రెండూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. నకిలీ ఓట్లు సృష్టిస్తున్నారనేందుకు ఆధారాలున్నాయన్నారు. దేశవ్యాప్తంగా లక్షల ఓట్లలో చేర్పులు, మార్పులు చేస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, ఓబీసీల ఓట్లు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాల్లో వ్యవస్థీకృతంగా ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర, కర్నాటకలో చేసినవాళ్లే యూపీ, హర్యానాలోనూ చేస్తున్నారని విమర్శించారు. ఇది హైడ్రోజన్ బాంబు కాదు.. హైడ్రోజన్ బాంబు ముందుందన్ననారు. ఓట్ల తొలగింపుపై నిజానిజాలు ప్రజలకు తెలియాలని సూచించారు. ఎన్నికలను ఎలా రిగ్గింగ్ చేస్తున్నారో ఆధారలతో ప్రజలకు చూపిస్తున్నామని ఆయన వెల్లడించారు.