6 August, 2026 | 8:37 PM

Breaking News

ఏఐకేఎంఎస్ రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయాలి: మామిడాల భిక్షపతి   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ధర్మరావుపేట విద్యార్థి ఎంపిక   •   వారాంతపు సంతను ప్రారంభించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు   •   300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత   •   ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని నిర్వహించిన బోధన్ స్వర్ణకార సంఘం   •   నిజాయితీ, నిరాడంబర జీవనానికి ఆదర్శం ప్రొఫెసర్ జయశంకర్   •   నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి   •   అనుమతి లేకుండా కమ్యూనిటీ హాల్ కూల్చివేత   •   జగ్గయ్యపల్లి ఉపాధి హామీ(వీబీజీ రాంజీ) ఆర్ధిక, అక్రమాలపై ఫిర్యాదులు   •   కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలి   •  

శాస్త్రీయ పురోగతికి అసలైన ఆలోచనలే పునాది

06-08-2026 07:23 PM

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రామాచారి

పటాన్ చెరు: శాస్త్రీయ పురోగతులకు అసలైన ఆలోచనలే పునాది అని, శాస్త్రీయ సాహిత్యాన్ని విస్తృతంగా చదివే అలవాటును పెంపొందించుకుని, జిజ్జాస, పట్టుదలతో పరిశోధన చేయాలని హైదరాబాద్ విశ్వవిద్యాలయం, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్, రసాయన శాస్త్ర సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ దేవలపల్లి బి. రామాచారి అన్నారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘సుస్థిర భవిష్యత్తు కోసం కొత్త ఉత్ప్రేరక ‘క్లిక్’ చర్యల ఆవిష్కరణ’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.

స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రామాచారి, ఆధునిక ఉత్ప్రేరక శాస్త్ర పరిణామక్రమాన్ని సదస్యులకు పరిచయం చేశారు. ఆర్గానోక్యాటలిసిస్ అనేది చిన్న సేంద్రీయ అణువులను ఉత్ప్రేరకాలుగా ఉపయోగించి రసాయన చర్యలను వేగవంతం చేస్తుందని, సాంప్రదాయ ఉత్ప్రేరక ప్రక్రియలకు పర్యావరణ అనుకూలమైన, సుస్థిరమైన ప్రత్యామ్నాయాలను అందిస్తుందన్నారు. ఈ ఉపన్యాసంలో ప్రొఫెసర్ రామాచారి అనేక మార్గదర్శక పరిశోధనల గురించి వివరించారు. ఔషధ రసాయన శాస్త్రంతో ఈ అణువుల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.

హెచ్ఐవీ ప్రొటీజ్ ఇన్హిబిటర్లు, క్యాన్సర్, క్షయ వ్యాధి నిరోధక మందులు, శిలీంధ్ర, బాక్టీరియా నిరోధక ఏజెంట్లు, హిస్టోన్ డీఎసిటైలేజ్ ఇన్హిబిటర్లు, బయోఆర్థోగోనల్ ప్రోబ్ లలో వీటి అనువర్తనాలను ఆయన ప్రస్తావించారు. తన పరిశోధనా ప్రస్థానం నుంచి పొందిన అంతర్దృష్టులను పంచుకుంటూ, కేవలం పరిశోధనా పత్రాలను ప్రచురించడం కంటే వినూత్న భావనలు మరింత విలువైనవని ప్రొఫెసర్ రామాచారి స్పష్టీకరించారు. పీహెచ్.డీ. ఆవిష్కరణలకు, ప్రభావవంతమైన పరిశోధనలకు గొప్ప అవకాశాలను కల్పిస్తుందంటూ, పోస్టు గ్రాడ్యుయేట్ చదువుల తరువాత కూడా తమ విద్యా ప్రయాణాన్ని కొనసాగించాలని ఆయన వర్ధమాన శాస్త్రవేత్తలను ప్రేరేపించారు.

సదస్యులతో జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణలో, ఇప్పటికే ఉన్న భావనలను మెరుగుపరచడంలో భారతీయ పరిశోధకులు అసాధారణ నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, మౌలిక ఆవిష్కరణలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలోచనలను రేకెత్తించే కొత్త విషయాలను పంచుకుంటూ, సహనం తనను ఒక పరిశోధకుడిగా, ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దిందని, రసాయన శాస్త్రంపై లోతైన అవగాహన శాస్త్రీయ ఆవిష్కణలలో గొప్ప ప్రశంసను, ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆతిథ్య ఉపన్యాసం, ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ముగిసింది. ఇందులో ప్రొఫెసర్ రామాచారి, ఉత్ప్రేరణ, పరిశోధన పద్ధతులు, రసాయన శాస్త్రంలో నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు, అధ్యాపక బృందం అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గీతంలోని మౌలిక సదుపాయాలు, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో దాని నిబద్ధతకు ముగ్ధుడైన డాక్టర్ రామాచారి, శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాలిఫోర్నియా లోని స్క్రిప్స్ రీసెర్చ్ లాగా గీతం కూడా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందని అభిప్రాయపడ్డారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలువురు రసాయన శాస్త్ర అధ్యాపకులతో కలిసి, విశిష్ట వక్తను సత్కరించి, ఆయన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసానికి కృతజ్జతలు తెలియజేశారు. అతిథితో కలిగి గ్రూపు ఫోటో దిగడంతో ఈ కార్యక్రమం ముగిసింది.